రజత కాంతలు...

1 Sep, 2018 00:41 IST|Sakshi

మహిళల హాకీలో  భారత్‌ చేజారిన స్వర్ణం

ఫైనల్లో 1–2తో జపాన్‌ చేతిలో ఓటమి

కబడ్డీలో స్వర్ణాలకు గండిపడినా... వెయిట్‌లిఫ్టింగ్‌లో వెనుకబడినా... హాకీలో పసిడి అందినట్టే అంది చేజారినా... 18వ ఏషియాడ్‌  భారత్‌కు మరుపురానిదిగానే మిగిలిపోనుంది. అథ్లెటిక్స్‌లో అనూహ్య ప్రదర్శనలు... స్క్వాష్‌లో సంచలనాలు... షూటింగ్‌లో అదిరిపోయే గురితో... పతకాల పట్టికలో మన దేశం ఇప్పటికే 2014 ఇంచియోన్‌ క్రీడల ప్రదర్శనను అధిగమించింది. 13వ రోజు శుక్రవారం మన ఖాతాలో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు జమయ్యాయి. దాంతో మొత్తం 65 పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. 2010 గ్వాంగ్‌జూ ఏషియాడ్‌లో భారత్‌ అత్యధికంగా 65 పతకాలు సాధించగా... జకార్తా క్రీడల్లో ఆ రికార్డు కూడా నేడు తెరమరుగు కానుంది.

జకార్తా: భారత హాకీ జట్ల ఏషియాడ్‌ ప్రయాణం స్వర్ణం లేకుండానే ముగిసింది. గురువారం పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓడి నిరాశపర్చగా... శుక్రవారం మహిళల బృందం ఫైనల్లో 1–2తో జపాన్‌ చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఒకటికి రెండు అవకాశాలు చేజార్చుకుని... చరిత్రలో నిలిచే రికార్డును కోల్పోయింది. తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌ అర్హత కోసం క్వాలిఫయింగ్‌ టోర్నీలు ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.  

సమం చేసి... చేజార్చుకుని 
మహిళల హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 9వ స్థానంలో ఉంటే జపాన్‌ ర్యాంక్‌ 14. దీనికి తగ్గట్లే తుది సమరంలో ఫేవరెట్‌గా బరిలో దిగింది రాణి రాంపాల్‌ సేన. అయితే, ఆటలో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. దూకుడైన ఆరంభానికి తొలి క్వార్టర్‌లోనే చక్కటి అవకాశాలు దక్కినా ఫినిషింగ్‌ లోపంతో గోల్స్‌గా మలచలేకపోయింది. ప్రత్యర్థి శిబిరంలోకి చొచ్చుకెళ్లి 4వ నిమిషంలో కెప్టెన్‌ రాణి ఇచ్చిన పాస్‌ను నవనీత్‌ కౌర్‌ వృథా చేసింది. 8వ నిమిషంలో జపాన్‌కూ గోల్‌ అవకాశం దక్కినా కీపర్‌ సవిత అడ్డుకుంది. 10వ నిమిషంలో నవనీత్‌ పెనాల్టీ కార్నర్‌ పాస్‌ ఇవ్వగా గుర్జీత్‌ కౌర్‌ స్కోరుగా మలచలేకపోయింది. అయితే, మినామి షిమిజు పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో  జపాన్‌కు 11వ నిమిషంలో ఫలితం దక్కింది. రెండో క్వార్టర్‌లో దాడిని పెంచిన భారత్‌కు... నేహా గోయల్‌ (25వ ని.లో) ఫీల్డ్‌ గోల్‌ అందించింది. ఈ భాగంలో బంతి ఎక్కువ శాతం మన జట్టు నియంత్రణలోనే ఉండటంతో పాటు పలు అవకాశాలు వచ్చాయి. అయితే, ఉదిత, వందన షాట్‌లను ప్రత్యర్థి కీపర్‌ సమర్థంగా నిలువరించింది.  మరోవైపు మొటొమొరి కవాముర (44వ ని.లో) పెనాల్టీ కార్నర్‌ను రివర్స్‌ హిట్‌తో నెట్‌లోకి పంపి జపాన్‌కు ఆధిక్యం అందించింది. చివరి పది నిమిషాల్లో భారత్‌ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా... ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇదే సమయంలో జపాన్‌ వ్యూహాత్మకంగా ఆడుతూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా కీపర్‌ సవితను ఉపసంహరించుకున్న భారత్‌కు చివరి 40 సెకన్లలో రెండు అవకాశాలొచ్చాయి. కానీ... అవేమీ స్కోరుగా మారలేదు. తొలిసారిగా 1982 ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన భారత మహిళలు... ఈసారి కూడా ఆ ఘనతను అందుకోలేకపోయారు. 1998 తర్వాత భారత జట్టు ఈసారే ఏషియాడ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

టీటీలో కథ ముగిసింది... 
ఆసియా క్రీడల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో భారత్‌ కథ ముగిసింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శరత్‌ 7–11, 11–9, 10–12, 16–14, 9–11తో చి యున్‌ చునాగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, సత్యన్‌ 11–9, 4–11, 9–11, 6–11, 10–12తో మట్సుడైరా (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మనికా బాత్రా 2–11, 8–11, 8–11, 11–6, 4–11తో వాంగ్‌ మన్యు (చైనా) చేతిలో ఓడింది.  
ఒక్క విజయం లేకుండానే: ఆసియా క్రీడల్లో భారత మహిళల వాలీబాల్‌ జట్టు ఒక్క విజయం సాధించకుండానే తమ పోరాటాన్ని ముగించింది. 9–10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 21–25, 16–25, 15–25తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడింది.

జూడోలో నిరాశ: పురుషుల 100 కేజీల జూడో ప్రిక్వార్టర్స్‌లో అవతార్‌ సింగ్‌ 1–10తో ఇవాన్‌ రామరెన్కో (యూఏఈ) చేతిలో ఓడగా... మహిళల ప్లస్‌ 78 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో అకిరా సోనె (జపాన్‌) చేతిలో రజ్విందర్‌ కౌర్‌ పరాజయం పాలైంది.   

మరిన్ని వార్తలు