స్క్వాష్‌లో సంచలనం 

1 Sep, 2018 00:58 IST|Sakshi

మహిళల టీమ్‌ ఫైనల్లో భారత్‌

సెమీస్‌లో మలేసియాపై గెలుపు

దిగ్గజ క్రీడాకారిణి నికోల్‌ను ఓడించిన జోష్నా  

జకార్తా: కఠినమైన ప్రత్యర్థి అనుకున్న మలేసియాను అతి సులువుగా ఓడించిన భారత మహిళల జట్టు ఆసియా క్రీడల స్క్వాష్‌లో తొలిసారి ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ మొదటి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 12–10, 11–9, 6–11, 10–12, 11–9తో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్, ఐదుసార్లు ఏషియాడ్‌ సింగిల్స్‌ విజేత నికోల్‌ డేవిడ్‌ను మట్టికరిపించింది. నాలుగో గేమ్‌లో 10–9 స్కోరుపై జోష్నా మ్యాచ్‌ బాల్‌ మీద ఉండగా... నికోల్‌ అద్భుతంగా పుంజుకుని మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను గెల్చుకుంది. ఐదో గేమ్‌లోనూ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైనా... ఈసారి జోష్నా పట్టువిడవకుండా పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో దీపికా పల్లికల్‌ 11–2, 11–9, 11–7తో లొ వీ వెర్న్‌ను ఓడించడంతో భారత్‌ 2–0తో గెలిచింది. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు.

పురుషుల విభాగంలో కాంస్యమే 
డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల స్క్వాష్‌ జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్‌ చేతిలో 2–0 తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో సౌరవ్‌ ఘోషాల్‌ 7–11, 9–11, 10–12తో మాక్స్‌ లీ చేతిలో... రెండో మ్యాచ్‌లో హరీందర్‌ పాల్‌ సంధూ 9–11, 11–9, 9–11, 11–13తో లియో అయు చేతిలో ఓడిపోయారు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా