పేస్‌ పునరాగమనం 

5 Jun, 2018 01:27 IST|Sakshi

ఆసియా క్రీడలకు  భారత టెన్నిస్‌ జట్టు ఎంపిక

యూకీ బాంబ్రీకి మినహాయింపు  

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ దిగ్గజం... ఈనెల 17న 45 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వెటరన్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ మరోసారి ఆసియా క్రీడల బరిలోకి దిగబోతున్నాడు. ఏషియాడ్‌ కోసం సోమవారం అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ప్రకటించిన ఆరుగురు సభ్యుల జట్టులో పేస్‌కు చోటు లభించింది. 1994 నుంచి 2006 వరకు నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని ఎనిమిది పతకాలు సాధించిన పేస్‌ 2010, 2014 పోటీలకు దూరమయ్యాడు. పతకాల వేటలో ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో సన్నద్ధమయ్యాడు. సింగిల్స్‌లో భారత అత్యుత్తమ ర్యాంకర్‌ (94) అయిన యూకీ బాంబ్రీ యూఎస్‌ ఓపెన్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండటంతో అతడిని ఎంపిక నుంచి మినహాయిస్తున్నట్లు ‘ఐటా’ ప్రకటించింది.

ఆసియా క్రీడల సమయంలోనే యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ కూడా జరగనుంది. ముగ్గురు సింగిల్స్‌ స్పెషలిస్ట్‌లు రామ్‌కుమార్‌ రామనాథన్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, సుమిత్‌ నాగల్‌లను... ముగ్గురు డబుల్స్‌ స్పెషలిస్ట్‌లు పేస్, రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌లను కమిటీ ఎంపిక చేసింది. డేవిస్‌ కప్‌ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా ఉన్న మహేశ్‌ భూపతి తాను ఏషియాడ్‌కు దూరంగా ఉంటానని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో జీషాన్‌ అలీకి ఆ బాధ్యతలు అప్పగించారు.   

మరిన్ని వార్తలు