భారత్‌కు రజతం 

29 Jul, 2018 02:43 IST|Sakshi

ఆసియా నేషన్స్‌ కప్‌ చెస్‌ టోర్నీ

హైదరాబాద్‌: ఆసియా నేషన్స్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత మహిళల, పురుషుల జట్లు రాణించాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, ఇషా కరవాడే, వైశాలి, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు ర్యాపిడ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. సూర్యశేఖర గంగూలీ, ఆధిబన్, కృష్ణన్‌ శశికిరణ్, అభిజిత్‌ గుప్తా, సేతురామన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు ర్యాపిడ్‌ ఓపెన్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇరాన్‌లోని హమదాన్‌ పట్టణంలో జరుగుతోన్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు నిర్ణీత ఏడు రౌండ్‌ల తర్వాత 17 పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచింది. ఇరాన్‌ వైట్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్‌ రెడ్‌ జట్లపై నెగ్గిన భారత్‌... ఇరాన్‌ గ్రీన్, వియత్నాం జట్లతో ‘డ్రా’ చేసుకొని... చైనా చేతిలో ఓడిపోయింది.

విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ అయితే ఒక పాయింట్‌ లభిస్తాయి. బోర్డు–1పై ఆడిన హారిక ఆరు పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకోగా... బోర్డు–3పై ఇషా కరవాడే కాంస్యం, బోర్డు–4పై వైశాలి స్వర్ణం సొంతం చేసుకున్నారు. మరోవైపు భారత పురుషుల జట్టు నిర్ణీత ఏడు రౌండ్‌ల తర్వాత పది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్, ఇరాన్‌ గ్రీన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్‌ వైట్, వియత్నాంలపై నెగ్గిన భారత జట్టు చైనా, కజకిస్తాన్‌ జట్ల చేతుల్లో ఓడింది. బోర్డు–2పై ఆధిబన్‌ రజతం, బోర్డు–3పై శశికిరణ్, బోర్డు–5పై సేతరామన్‌ కాంస్య పతకాలు గెల్చుకున్నారు.   

మరిన్ని వార్తలు