అతాను-దీపిక జంటకు రజతం

20 Jun, 2016 00:02 IST|Sakshi
అతాను-దీపిక జంటకు రజతం

అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో అతాను దాస్-దీపిక కుమారిలతో కూడిన భారత జోడీ రజత పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో అతాను దాస్-దీపిక ద్వయం 1-5 తేడాతో కు బొన్‌చాన్-మిసున్ చోయ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. సెట్‌ల పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఒక్కో జంటకు నాలుగేసి బాణాలు సంధించే అవకాశాన్ని కల్పిస్తారు. సెట్ నెగ్గిన వారికి రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ లభిస్తుంది.

తొలి సెట్‌ను కొరియా 36-33తో నెగ్గి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్‌లో 36-36తో స్కోరు సమంగా నిలిచింది. దాంతో కొరియా ఆధిక్యం 3-1కి పెరిగింది. మూడో సెట్‌ను కొరియా 38-37తో గెలిచి 5-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో నాలుగో సెట్‌ను నిర్వహించలేదు. అంతకుముందు మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 1-5తో ఇటలీ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది.

మరిన్ని వార్తలు