కోల్‌కతాకే కిరీటం

19 Dec, 2016 00:21 IST|Sakshi
కోల్‌కతాకే కిరీటం

రెండోసారి ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ కైవసం ∙రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) మూడో సీజన్‌కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆదివారం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నువ్వా.. నేనా అనే రీతిలో జరిగిన ఫైనల్లో అట్లెటికో డి కోల్‌కతా రెండోసారి విజేతగా నిలిచింది. సొంతగడ్డపై తొలి టైటిల్‌ సాధించాలని ఉవ్విళ్లూరిన కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీపై కోల్‌కతా 4–3 తేడాతో పెనాల్టీ షూటౌట్‌ ద్వారా నెగ్గింది. లీగ్‌ తొలి సీజన్‌ ఫైనల్లోనూ కోల్‌కతా జట్టు కేరళపైనే నెగ్గింది. అలాగే ఈ సీజన్‌లో సొంతగడ్డపై వరుసగా ఆరు విజయాలు సాధించిన కేరళకు ఇదే తొలి పరాజయం. చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్లు దక్కగా.. రన్నరప్‌ కేరళకు రూ.4 కోట్లు అందించారు. మ్యాచ్‌ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు్ల 1–1తో సమంగా నిలిచాయి. కేరళ బ్లాస్టర్స్‌ నుంచి మొహమ్మద్‌ రఫీఖ్‌ (37), కోల్‌కతా నుంచి సెరెనో (44) గోల్స్‌ చేశారు. దీంతో ఫలితం కోసం అదనపు సమయాన్ని కేటాయించినా గోల్స్‌ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది.

ఇందులో మొదట కేరళ నుంచి ఆంటోనియో జర్మన్, బెల్‌ఫోర్ట్, రఫీఖ్‌ గోల్స్‌ సాధించగా డోయో, హెంగ్‌బర్ట్‌ విఫలమయ్యారు. ఇక కోల్‌కతా నుంచి డౌటీ, బోర్జా, లారా, జ్యువెల్‌ రాజా విజయవంతం కాగా హ్యూమే ఒక్కడు విఫలమయ్యాడు. అంతకుముందు మ్యాచ్‌ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీ ఆటతో తమ ఉద్దేశాన్ని చాటుకున్నాయి. తొలి భాగంలోనే ఒక్కో గోల్‌ సాధించాయి. రెండో అర్ధభాగంలో రెండు జట్లు ప్రయత్నించినా మరో గోల్‌ చేయలేకపోయాయి. ఫలితం కోసం మరో అరగంట అదనపు సమయం కేటాయించారు. గోల్స్‌ నమోదు కాకపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది.  
 

మరిన్ని వార్తలు