ఫెడరర్‌కు చుక్కెదురు

13 Nov, 2018 01:13 IST|Sakshi

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ  

లండన్‌: కెరీర్‌లో వందో టైటిల్‌తో ఈ ఏడాదిని ముగించాలని ఆశిస్తున్న స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు సీజన్‌ చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో శుభారంభం లభించలేదు. ‘లీటన్‌ హెవిట్‌ గ్రూప్‌’లో భాగంగా జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–7 (4/7), 3–6తో కీ నిషికోరి (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌లో ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది.

టైబ్రేక్‌లో నిషికోరి పైచేయి సాధించి తొలి సెట్‌ గెల్చుకున్నాడు. రెండో సెట్‌లోని తొలి గేమ్‌లోనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ ఆ వెంటనే తన సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఆరో గేమ్‌లో ఫెడరర్‌ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్‌ చేసిన నిషికోరి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో ఫెడరర్‌ 34 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) 6–3, 7–6 (12/10)తో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై గెలిచాడు. గతంలో రికార్డుస్థాయిలో ఆరుసార్లు సీజన్‌ ముగింపు టోర్నీ టైటిల్‌ నెగ్గిన ఫెడరర్‌ సెమీఫైనల్‌ రేసులో నిలవాలంటే డొమినిక్‌ థీమ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి.    

మరిన్ని వార్తలు