ప్రేక్షకులొచ్చారు...

7 Jun, 2020 00:53 IST|Sakshi

వియత్నాం దేశవాళీ ఫుట్‌బాల్‌ టోర్నీలో అభిమానుల సందడి

హో చి మిన్‌ సిటీ (వియత్నాం): కరోనాతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆటగాళ్లు కనీసం ప్రాక్టీస్‌ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ చిన్నా చితకా ఈవెంట్లు జరుగుతున్నప్పటికీ ప్రేక్షకుల్ని అనుమతించేంత ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అయితే దేశవాళీ ఫుట్‌బాల్‌ లీగ్‌కు అభిమానులను ఆహ్వానించి వియత్నాం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వి–లీగ్‌లో భాగంగా అక్కడ శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌లను దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. మైదానానికి తరలి వచ్చిన అభిమానులకు ముందు జాగ్రత్తగా థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు.

అయితే వారు మాస్కులు ధరించకపోవడం విశేషం. ప్రేక్షకుల సమక్షంలో ఆడటం సంతోషంగా ఉందని, వారే ఆటకు ప్రత్యేకమని ‘హో చి మిన్‌’ జట్టు కోచ్‌ జంగ్‌ హు– సంగ్‌ అన్నారు. చైనాతో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నప్పటికీ వియత్నాం కరోనాను సమర్థంగా నియంత్రించింది. 10 కోట్ల జనాభా కలిగిన వియత్నాంలో కేవలం 328 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు కాగా ఒక్క మరణం కూడా సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం మొత్తం మూడు మ్యాచ్‌లు జరగ్గా... రెండు ‘డ్రా’గా ముగిశాయి. మరో మ్యాచ్‌లో ఫలితం వచ్చింది.

మరిన్ని వార్తలు