2020లో తొలి సెంచరీ..

3 Jan, 2020 11:24 IST|Sakshi

సిడ్నీ: గతేడాది హ్యాట్రిక్‌ టెస్టు సెంచరీల ఘనత..  అదే క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి టెస్టు పరుగులు సాధించిన రికార్డు సైతం ఆసీస్‌ క్రికెటర్‌ మార్కస్‌ లబూషేన్‌దే. 2019లో 1,104 టెస్టు పరుగులు సాధించిన లబూషేన్‌.. ఆ ఏడాది వెయ్యి పరుగులు చేరిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ ఏడాదిని కూడా ఘనంగా ఆరంభించాడు లబూషేన్‌. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో లబూషేన్‌ శతకంతో మెరిశాడు. ఫలితంగా 2020లో తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా తన కెరీర్‌లో 13 టెస్టులు ఆడిన లబూషేన్‌ 4 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. 60కి పైగా యావరేజ్‌తో  56కు పైగా స్టైక్‌రేట్‌తో తనదైన ముద్రతో చెలరేగిపోతూ ఆసీస్‌ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు.  గత ఐదు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించడం అతడిలోనే నిలకడకు అద్దం పడుతోంది.(ఇక్కడ చదవండి: భారీ హ్యాట్రిక్‌ శతకాలు.. డబుల్‌ సెంచరీ ఎప్పుడో?)

న్యూజిలాండ్‌తో ఆఖరిదైన మూడో టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో ఆసీస్‌ బ్యాటింగ్‌ను డేవిడ్‌ వార్నర్‌- జో బర్న్స్‌లు ఆరంభించారు. బర్న్స్‌(18) నిరాశపరచగా, వార్నర్‌ మాత్రం 45 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో లబూషేన్‌-స్టీవ్‌ స్మిత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఒకవైపు స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన లబూషేన్‌ సెంచరీ సాధించాడు. గ్రాండ్‌ హోమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 72 ఓవర్‌ మూడో బంతికి ఫోర్‌ కొట్టడంతో ద్వారా లబూషేన్‌ సెంచరీ పూర్తయ్యింది.  ఈ టెస్టులో ఆసీస్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 77 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.(ఇక్కడ చదవండి: లబూషేన్‌ @ 1000 నాటౌట్‌)

మరిన్ని వార్తలు