మళ్లీ సెంచరీల మోత మోగించారు..

29 Nov, 2019 16:36 IST|Sakshi

అడిలైడ్‌: పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో భారీ సెంచరీ సాధించి ఇన్నింగ్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. మళ్లీ శతకం బాదేశాడు. పాకిస్తాన్‌తో ఈ రోజు ఆరంభమైన డే అండ్‌ నైట్‌ టెస్టులో వార్నర్‌ సెంచరీ నమోదు చేశాడు. సహచర ఓపెనర్‌ జో బర్న్స్‌(4) విఫలమైనా వార్నర్‌ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. తొలుత హాఫ్‌ సెంచరీని ఎటువంటి తడబాటు లేకుండా పూర్తి చేసిన వార్నర్‌.. దాన్ని సెంచరీగా మలచుకున్నాడు. అతనికి లబూషేన్‌ అండగా నిలిచాడు. వీరిద్దరూ  రెండొందల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆసీస్‌ మరొకసారి భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది.

ఇది వార్నర్‌కు 23వ టెస్టు సెంచరీ. దాంతో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో వార్నర్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మాథ్యూ హేడెన్‌(30) తొలి స్థానంలో ఉండగా, వార్నర్‌ ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌తో రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. దాంతో ఆసీస్‌ బ్యాటింగ్‌ను వార్నర్‌-జో బర్న్స్‌లు ఆరంభించారు. కాగా, బర్న్స్‌(4) నిరాపరిచాడు. షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతో ఎనిమిది పరుగుల వద్ద ఆసీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో వార్నర్‌తో కలిసి లబూషేన్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ క‍్రమంలోనే వార్నర్‌ సెంచరీ నమోదు చేయగా, లబూషేన్‌ హాఫ్‌ సెంచరీ మార్కును చేరాడు. హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత కాస్త నెమ్మదిగా ఆడిన లబూషేన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీలు సాధించిన వార్నర్‌-లబూషేన్‌లు.. మళ్లీ  శతకాల మోత మోగించడం విశేషం.

మరిన్ని వార్తలు