ఆసక్తికరంగా యాషెస్‌ టెస్టు

4 Aug, 2019 05:14 IST|Sakshi
చూశారా... జేబులో ఏమీ లేదు !

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 124/3

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 374 ఆలౌట్‌

బర్మింగ్‌హామ్‌:  యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో మూడో రోజు అనేక మలుపులతో రసవత్తరంగా సాగింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వార్నర్‌ (8), బాన్‌క్రాఫ్ట్‌ (7), ఉస్మాన్‌ ఖాజా (40) పెవిలియన్‌కు చేరగా... స్టీవ్‌ స్మిత్‌ (46 బ్యాటింగ్‌), ట్రవిస్‌ హెడ్‌ (21 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించారు.

వెలుతురు లేని కారణంగా ఆటను చాలా ముందుగా నిలిపివేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యం కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 34 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చాలా కష్టమని అంచనాలు ఉన్న నేపథ్యంలో నాలుగో రోజు కంగారూలు ఎన్ని పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు లక్ష్యాన్ని నిర్దేశిస్తారనేది ఆసక్తికరం.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 267/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌటైంది. బర్న్స్‌ (133) ఆరంభంలోనే వెనుదిరగ్గా, బెన్‌ స్టోక్స్‌ (50) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక దశలో ఆసీస్‌ 18 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీసింది. అయితే క్రిస్‌ వోక్స్‌ (37 నాటౌట్‌), స్టువర్ట్‌ బ్రాడ్‌ (29) తొమ్మిదో వికెట్‌కు 65 పరుగులు జత చేసి జట్టును మెరుగైన స్థితికి చేర్చారు. చివరకు ఇంగ్లండ్‌కు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.  కమిన్స్, లయన్‌ చెరో 3 వికెట్లు తీశారు. బ్రాడ్‌ తన 128వ టెస్టులో 450 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం.
   
బాల్‌ ట్యాంపరింగ్‌ నిషేధం ముగిసిన తర్వాత తొలి టెస్టు ఆడుతున్న స్మిత్, వార్నర్‌లను ఇంగ్లండ్‌ అభిమానులు తొలి రోజునుంచే గేలి చేస్తున్నారు. అయితే వీరిద్దరు మాత్రం దానిని పట్టించుకోకుండా  ఆటపైనే దృష్టి పెట్టారు. శనివారం మాత్రం వార్నర్‌ ప్రేక్షకులకు సమాధానమిచ్చాడు. అయితే అది సరదాగానే సుమా... జేబులో స్యాండ్‌పేపర్‌ పెట్టుకొని ట్యాంపరింగ్‌ వివాదానికి కారణమైన వార్నర్‌ ఇప్పుడు మాత్రం తాను అలాంటి పనేమీ చేయడం లేదని, కావాలంటే మీరే చూసుకోండి అంటూ పోజివ్వడం విశేషం!   

మరిన్ని వార్తలు