ఆసీస్‌ శుభారంభం

2 Jun, 2019 01:16 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్లతో గెలుపు

రాణించిన కమిన్స్, జంపా

మెరిసిన వార్నర్, ఫించ్‌  

ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్, శ్రీలంక మాజీ చాంపియన్లు. కానీ విండీస్‌తో 22 ఓవర్లయినా ఆడలేని పాక్‌ 105 పరుగులను మించలేదు. కివీస్‌పై లంక 30 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే 136 పరుగులకే ఆలౌటైంది. కానీ క్రికెట్‌ కూన అఫ్గానిస్తాన్‌ ఐదుసార్లు చాంపియన్‌ అయిన ఆసీస్‌ను చక్కగా ఎదుర్కొంది. ఫలితం ఓటమైనా... మెరుగైన ప్రదర్శన కనబరిచింది.  

బ్రిస్టల్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై జయభేరి మోగించింది. ముందుగా అఫ్గానిస్తాన్‌ 38.2 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. నజీబుల్లా జద్రాన్‌ (51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్, జంపా చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వార్నర్‌ (114 బంతుల్లో 89 నాటౌట్‌; 8 ఫోర్లు), కెప్టెన్‌ ఫించ్‌ (49 బంతుల్లో 66; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.

నజీబుల్లా అర్ధసెంచరీ...
టాస్‌ నెగ్గిన అఫ్గానిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ ఓపెనర్లు షహజద్‌ (0), హజ్రతుల్లా (0) డకౌటయ్యారు. ఈ దశలో రహమత్‌ షా (43; 6 ఫోర్లు) జట్టును          ఆదుకున్నాడు. హష్మతుల్లా షాహిది (18)తో కలిసి జట్టును నడిపించాడు. మళ్లీ జంపా దెబ్బకు 77 పరుగులకే 5 వికెట్లను కోల్పోగా... కెప్టెన్‌ గుల్బదిన్‌ (31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), నజీబుల్లా జద్రాన్‌ ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో పాటు రషీద్‌ ఖాన్‌ (27; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 200 పైచిలుకు స్కోరు చేసింది.

ఓపెనర్ల జోరు...
లక్ష్యం చిన్నది. జట్టు కూడా పసికూన కావడంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఫించ్, వార్నర్‌ చక్కగా ఆడుకున్నారు. వార్నర్‌ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతుంటే కెప్టెన్‌ ఫించ్‌ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాక ఫించ్‌ నిష్క్రమించగా, తర్వాత వచ్చిన ఖాజాతో కలిసి స్కోరును నడిపించిన వార్నర్‌ 74 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఖాజా (15)ను రషీద్‌ ఖాన్‌ ఔట్‌ చేయగా... లక్ష్యానికి చేరువలో స్మిత్‌ (18)ను ముజీబ్‌ పెవిలియన్‌ చేర్చాడు. మిగతా లాంఛనాన్ని మ్యాక్స్‌వెల్‌ (4 నాటౌట్‌) ఫోర్‌తో ముగించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబుర్, రషీద్‌ ఖాన్, గుల్బదిన్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది.   

మరిన్ని వార్తలు