డే నైట్ టెస్టు ఆసీస్‌దే

30 Nov, 2015 01:32 IST|Sakshi
డే నైట్ టెస్టు ఆసీస్‌దే

 మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
  2-0తో సిరీస్ కైవసం
 
 అడిలైడ్: గులాబీ బంతులతో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తొలి డే అండ్ నైట్ టెస్టులో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 2-0తో కైవసం చేసుకుంది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మూడో రోజు ఆదివారం బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (49), వార్నర్ (35), వోజెస్ (28), మిషెల్ మార్ష్ (28) తలా కొన్ని పరుగులు జత చేశారు.
 
 బర్న్స్ (11)తో కలిసి తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించిన వార్నర్... స్మిత్ (14)తో కలిసి రెండో వికెట్‌కు 28 పరుగులు జత చేసి శుభారంభాన్నిచ్చాడు. తర్వాత షాన్ మార్ష్ కీలక ఇన్నింగ్స్‌తో వెన్నెముకగా నిలిచాడు. వోజెస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 49; మిచెల్ మార్ష్‌తో కలిసి ఐదో వికెట్‌కు 46 పరుగులు జత చేసి జట్టును విజయం అంచులకు చేర్చాడు. చివర్లో సిడిల్ (9 నాటౌట్), నివిల్ (10) లాంఛనం పూర్తి చేశారు. బౌల్ట్ 5, బ్రాస్‌వెల్, సాంట్నెర్ చెరో వికెట్ తీశారు.
 
 అంతకుముందు 116/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. సాంట్నెర్ (45), బ్రాస్‌వెల్ (27 నాటౌట్), సౌతీ (13) ఓ మాదిరిగా ఆడారు. హాజెల్‌వుడ్ 6, మిషెల్ మార్ష్ 3 వికెట్లు పడగొట్టారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు కూడా బాగానే పోటెత్తారు. హాజెల్‌వుడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
 

మరిన్ని వార్తలు