పాక్‌ తొడగొట్టినా... ఆసీస్‌ పడగొట్టింది

13 Jun, 2019 05:27 IST|Sakshi

41 పరుగులతో ఫించ్‌ బృందం గెలుపు

సెంచరీతో మెరిసిన డేవిడ్‌ వార్నర్‌

ఆమిర్‌ అద్భుత బౌలింగ్‌ వృథా

టాంటన్‌: ఈ ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం సాధించే అవకాశాన్ని పాకిస్తాన్‌ కాలదన్నుకుంది. తొలుత బౌలింగ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆ జట్టు... బ్యాటింగ్‌లో మంచి స్థితిలో ఉండీ గెలుపును చేజార్చుకుంది. దీంతో ఆస్ట్రేలియాతో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (111 బంతుల్లో 107; 11 ఫోర్లు, సిక్స్‌) శతకం బాదడంతో పాటు కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (84 బంతుల్లో 82; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడంతో... టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.

పేసర్‌ ఆమిర్‌ (5/30) ప్రత్యర్థికి కళ్లెం వేశాడు. ఛేదనలో పాక్‌ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (75 బంతుల్లో 53; 7 ఫోర్లు), హఫీజ్‌ (46; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించినా మిడిలార్డర్‌ వైఫల్యం దెబ్బకొట్టింది. టెయిలెండర్లు హసన్‌ అలీ (15 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), వహాబ్‌ రియాజ్‌ (39 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులకు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (48 బంతుల్లో 40; ఫోర్‌) అండగా నిలిచి పోరాడినా... పేసర్‌ స్టార్క్‌ (2/43) ఒకే ఓవర్లో రియాజ్, ఆమిర్‌ (0)లను ఔట్‌ చేసి ఆసీస్‌ విజయాన్ని ఖాయం చేశాడు. కమిన్స్‌ (3/33) పొదుపుగా బంతులేశాడు.

ఆరంభం అదిరినా... చివర్లో చతికిల
146/0. రన్‌రేట్‌ 6.63. 22 ఓవర్లకు ఆసీస్‌ స్కోరిది. కానీ, 23వ ఓవర్‌ తొలి బంతికి ఫించ్‌ను ఔట్‌ చేసి ఆమిర్‌ మలుపు తిప్పాడు. వార్నర్‌ సహజ శైలిలో ఆడుతూ పోతుంటే... మరో ఎండ్‌లో స్మిత్‌ (10), మ్యాక్స్‌వెల్‌ (20), షాన్‌ మార్‌‡్ష (23), ఖాజా (18) వెంటవెంటనే ఔటయ్యారు. 102 బంతుల్లో కెరీర్‌లో 15వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌ ఎక్కువసేపు నిలువలేదు. కీపర్‌ అలెక్స్‌ క్యారీ (20)తో పాటు స్టార్క్‌ (3)ను చక్కటి బంతులతో డగౌట్‌ చేర్చిన ఆమిర్‌ 49వ ఓవర్లోనే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. కంగారూలు తమ పది వికెట్లను 28 ఓవర్ల వ్యవధిలో 161 పరుగులకే కోల్పోయారు.

ఛేదించేలా కనిపించి... చేజేతులా
ఫఖర్‌ జమాన్‌ (0)ను ఖాతా తెరవకుండానే ఔట్‌ చేసి ఛేదనలో పాక్‌కు కమిన్స్‌ షాకిచ్చాడు. ఇమాముల్, ఆజమ్‌ (28 బంతుల్లో 30; 7 ఫోర్లు) చకచకా బౌండరీలు బాదుతూ ఆశలు రేపారు. ఈ స్థితిలో బాబర్‌ అనవసర షాట్‌కు పోయి వికెట్‌ పారేసుకున్నాడు. ఇమాముల్, హఫీజ్‌ మూడో వికెట్‌కు 86 బంతుల్లో 80 పరుగులు జోడించడంతో పాక్‌ లక్ష్యం దిశగా సాగుతున్నట్లే కనిపించింది. కమిన్స్‌ ఓవర్లో లెగ్‌ సైడ్‌ వెళ్తున్న బంతిని వేటాడి ఇమాముల్, పార్ట్‌టైమర్‌ ఫించ్‌ బంతిని భారీ షాట్‌ ఆడబోయి హఫీజ్‌ వరుస ఓవర్లలో వెనుదిరగడం దెబ్బకొట్టింది. షోయబ్‌ మాలిక్‌ (0), ఆసిఫ్‌ అలీ (5) పేలవంగా నిష్క్రమించారు. 160/6తో పరాజయం అంచుల్లో ఉన్న జట్టును సర్ఫరాజ్, హసన్‌ అలీ, రియాజ్‌ మొండిగా నడిపించినా లాభం లేకపోయింది.   

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: ఫించ్‌ (సి) హఫీజ్‌ (బి) ఆమిర్‌ 82; వార్నర్‌ (సి) ఇమాముల్‌ (బి) షాహీన్‌  107; స్మిత్‌ (సి) ఆసిఫ్‌ అలీ (బి) హఫీజ్‌ 10; మ్యాక్స్‌వెల్‌ (బి) షాహీన్‌ 20; షాన్‌ మార్‌‡్ష (సి) షోయబ్‌ మాలిక్‌ (బి) ఆమిర్‌ 23; ఖాజా (సి) వహాబ్‌ రియాజ్‌ (బి) ఆమిర్‌ 18; క్యారీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆమిర్‌ 20; కూల్టర్‌నైల్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) రియాజ్‌ 2; కమిన్స్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) హసన్‌ అలీ 2; స్టార్క్‌ (సి) షోయబ్‌ మాలిక్‌ (బి) ఆమిర్‌ 3; రిచర్డ్‌సన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్‌) 307.

వికెట్ల పతనం: 1–146, 2–189, 3–223, 4–242, 5–277, 6–288, 7–299, 8–302, 9–304, 10–307.

బౌలింగ్‌: ఆమిర్‌ 10–2–30–5; షాహీన్‌ ఆఫ్రిది 10–0–70–2; హసన్‌ అలీ 10–0–67–1; వహాబ్‌ రియాజ్‌ 8–0–44–1; హఫీజ్‌ 7–0–60–1; షోయబ్‌ మాలిక్‌ 4–0–26–0.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఇమాముల్‌ హక్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 53; ఫఖర్‌ జమాన్‌ (సి) రిచర్డ్‌సన్‌ (బి) కమిన్స్‌ 0; బాబర్‌ ఆజమ్‌ (సి) రిచర్డ్‌సన్‌ (బి) కూల్టర్‌నైల్‌ 30; హఫీజ్‌ (సి) స్టార్క్‌ (బి) ఫించ్‌ 46; సర్ఫరాజ్‌ (రనౌట్‌) 40; షోయబ్‌ మాలిక్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 0; ఆసిఫ్‌ అలీ (సి) క్యారీ (బి) రిచర్డ్‌సన్‌ 5; హసన్‌ అలీ (సి) ఖాజా (బి) రిచర్డ్‌సన్‌ 32; వహాబ్‌ రియాజ్‌ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 45; ఆమిర్‌ (సి) స్టార్క్‌ 0; షాహీన్‌ ఆఫ్రిది (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్‌) 266.

వికెట్ల పతనం: 1–2, 2–56, 3–136, 4–146, 5–147, 6–160, 7–200, 8–264, 9–265, 10–266.

బౌలింగ్‌: కమిన్స్‌ 10–0–33–3, స్టార్క్‌ 9–1–43–2, రిచర్డ్‌సన్‌ 8.4–0–62–2, కూల్టర్‌నైల్‌ 9–0–53–1, మ్యాక్స్‌వెల్‌ 7–0–58–0, ఫించ్‌ 2–0–13–1.   


 

మరిన్ని వార్తలు