పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి! 

4 Apr, 2020 03:41 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆవేదన

మెల్‌బోర్న్‌: సాధారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఏప్రిల్‌ అంటే పెళ్లిళ్ల మాసం. కొద్ది రోజుల క్రితమే క్రికెట్‌ సీజన్‌ ముగియడంతో పాటు వాతావరణం మారిపోయి చలిగాలులు పెరగక ముందే పెళ్లి చేసుకునేందుకు వారు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇప్పుడు కోవిడ్‌–19 కారణంగా ఆ ప్రణాళికలన్నీ తలకిందులవుతున్నాయి. జాతీయ జట్టుకు ఆడుతున్న వారు, బోర్డు కాంట్రాక్ట్‌ ఉన్నవారిని చూస్తే ఎనిమిది మంది క్రికెటర్లు ఏప్రిల్‌లో పెళ్లికి సిద్ధపడ్డారు. ఆడమ్‌ జంపా, ఆండ్రూ టై, డార్సీ షార్ట్, స్వెప్సన్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. పెళ్లికి కూడా ఐదుగురుకు మించి హాజరు కారాదు. వధూవరులతో పాటు ఇద్దరు సాక్షులు, పెళ్లి జరిపించే పాస్టర్‌ మాత్రమే ఉండాలి. దాంతో భారీగా వివాహం తలపెట్టినవారంతా వాయిదాలు వేసుకుంటున్నారు.

మరో ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్లు కమిన్స్, మ్యాక్స్‌వెల్‌ల పరిస్థితి ఇందుకు భిన్నం. వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థాలు జరుపుకోగా, ఇంకా పెళ్లి తేదీలు నిర్ణయించుకోలేదు. కమిన్స్‌ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. అతను పెళ్లి చేసుకోబోయే బెకీ బోస్టన్‌ ఇంగ్లండ్‌కు చెందిన అమ్మాయి. ఇప్పుడు కరోనా వల్ల ఇంగ్లండ్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఏ రోజుకారోజు వారి క్షేమ సమాచారం తెలుసుకోవడమే సరిపోతుందని, ఈ సమయంలో ఇంకా పెళ్లెలా జరుగుతుందని కమిన్స్‌ వాపోయాడు.  మరోవైపు కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగే అవకాశాలు సన్నగిల్లుతుండటంతో కమిన్స్‌ బాధ రెట్టింపయ్యేలా ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక విలువకు (రూ. 15.5 కోట్లు) అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పుడు లీగ్‌ జరగకపోతే ఇంత భారీ మొత్తం అతను కోల్పోయినట్లే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు