వెస్టిండీస్ రాత మారేనా!

3 Jan, 2016 01:47 IST|Sakshi
వెస్టిండీస్ రాత మారేనా!

నేటినుంచి ఆస్ట్రేలియాతో చివరి టెస్టు
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరమైన ఆటతీరు కనబరుస్తున్న వెస్టిండీస్ జట్టుకు కాస్తయినా పరువు నిలబెట్టుకునేందుకు చివరి అవకాశం మిగిలింది. ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ఆదివారం నుంచి సిడ్నీలో జరుగుతుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి ఇప్పటికే ఫ్రాంక్‌వరెల్ ట్రోఫీని నిలబెట్టుకున్న స్మిత్ సేన 3-0పై గురి పెట్టింది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఆసీస్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. నాథన్ లయోన్‌తో పాటు స్టీవ్ ఓ కీఫ్ జట్టులోకి ఎంపికయ్యాడు.

గత రెండు టెస్టుల్లో విండీస్ తరఫున డారెన్ బ్రేవో మినహా మిగతా ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. గత టెస్టు చివర్లో కొంత పోరాట పటిమ కనబర్చిన ఆ జట్టు బ్యాటింగ్‌కు అనుకూలించే సిడ్నీ మైదానంలో ఏ మాత్రం మెరుగు పడుతుందో చూడాలి. కీమర్ రోచ్ స్థానంలో యువ పేసర్ మిగల్ కమిన్స్‌కు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కవచ్చు.

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, నిధుల సేకరణలో భాగంగా ఈ టెస్టు మ్యాచ్ మొత్తం గులాబీ రంగుమయం కానుంది. మ్యాచ్ ద్వారా దాదాపు 3 లక్షల 80 వేల డాలర్లు (దాదాపు రూ. 2.5 కోట్లు) సేకరించి మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.

ఉదయం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు