ఆసీస్‌... అతి జాగ్రత్తగా!

6 Mar, 2017 00:09 IST|Sakshi
ఆసీస్‌... అతి జాగ్రత్తగా!

ఇబ్బంది పెట్టిన భారత బౌలర్లు
ఆదుకున్న రెన్‌షా, షాన్‌ మార్ష్
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 237/6  ప్రస్తుత ఆధిక్యం 48  


తొలి రోజు భారత బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులెత్తేసినా రెండో రోజు ఆటలో మన బౌలర్లు ఆస్ట్రేలియాను కాస్త కట్టడి చేయగలిగారు. కచ్చితమైన బౌలింగ్‌తో వారి దూకుడును తగ్గించి ఆత్మరక్షణలో పడేశారు. స్పిన్నర్‌ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రెచ్చిపోగా... పేసర్లు ఉమేశ్, ఇషాంత్‌ శర్మ పరుగులను నియంత్రించారు. మొత్తంగా రెండో రోజు 197 పరుగులు మాత్రమే ఇవ్వగలిగిన భారత్‌కు మిగిలిన రోజుల్లో వరుణుడు కరుణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ టెస్టు వారి చేతుల్లో నుంచి జారే పరిస్థితి ఉండదేమో!

అటు తొలి రెండు సెషన్‌లు జాగ్రత్తగా ఆడిన ఆస్ట్రేలియా చివరి సెషన్‌లో మాత్రం కొంచెం పుంజుకోగలిగింది. యువ బ్యాట్స్‌మన్‌ రెన్‌షా మరోసారి తన ప్రతిభను చాటుకోగా షాన్‌ మార్ష్‌ నిలకడైన ఆటతో జట్టుకు అండగా నిలబడ్డాడు. అయితే దూకుడైన ఆటతో కనీసం వంద పరుగుల ఆధిక్యాన్ని సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచుదామనుకున్న స్మిత్‌ సేనకు ఆ అవకాశం దక్కలేదు. ప్రస్తుతం 48 పరుగుల స్వల్ప ఆధిక్యంతో ఉన్న ఆసీస్‌కు మూడో రోజు ఆట కీలకం కానుంది.

బెంగళూరు: రెండో రోజు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారీ స్కోరుతో ఒత్తిడి పెంచాలనుకున్న ఆస్ట్రేలియా... పూర్తిగా రక్షణాత్మక ఆటతీరుకే పరిమితమైంది. బ్యాటింగ్‌ చేసేందుకు పిచ్‌ అంతగా సహకరించకపోవడంతో ఆసీస్‌ ఆచితూచి ఆడింది. ఓపిగ్గా క్రీజులో నిలిచిన షాన్‌ మార్ష్ (197 బంతుల్లో 66; 4 ఫోర్లు), యువ ఓపెనర్‌ మ్యాట్‌ రెన్‌షా (196 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా రెండో టెస్టులో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 6 వికెట్లకు 237 పరుగులు చేసింది. వార్నర్‌ (67 బంతుల్లో 33; 3 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. క్రీజులో వేడ్‌ (68 బంతుల్లో 25 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), మిషెల్‌ స్టార్క్‌ (19 బంతుల్లో 14 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్‌ 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్పిన్నర్‌ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, పేసర్లు ఉమేశ్, ఇషాంత్‌లకు తలా ఓ వికెట్‌ దక్కింది.

సెషన్‌–1: భారత్‌ ఆధిపత్యం
రెండో రోజు తొలి బంతినే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌండరీగా మలిచి తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే ఆట జరుగుతున్నకొద్దీ భారత బౌలర్లు పైచేయి సాధించారు. 22వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన అద్భుత బంతి సుడులు తిరుగుతూ ఆఫ్‌స్టంప్‌ను పడగొట్టడంతో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ వార్నర్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బంతికే స్మిత్‌ (8) ఆడిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌ బౌలింగ్‌ ఎండ్‌లో ఉన్న రెన్‌షా పక్కకు వెళ్లింది. దీన్ని అందుకోవడానికి అశ్విన్‌ వెళ్లగా రెన్‌షా అడ్డుగా నిలబడ్డాడు. దీంతో స్మిత్‌తో అశ్విన్‌.. బ్యాటింగ్‌ వైపు వెళ్లిన రెన్‌షాతో కోహ్లి వాగ్వాదానికి దిగారు. అయితే అంపైర్‌ కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిచారు. ఇక 30వ ఓవర్‌లో స్మిత్‌ ఎల్బీ కోసం భారత్‌ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. 38వ ఓవర్‌లో బరిలోకి దిగిన స్పిన్నర్‌ జడేజా కొద్దిసేపట్లోనే కీలకమైన స్మిత్‌ వికెట్‌ తీశాడు. బ్యాట్, ప్యాడ్‌కు తాకుతూ వెళ్లిన బంతిని కీపర్‌ సాహా తన ఎడమ వైపునకు పరిగెత్తుతూ సూపర్‌ డైవ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. పేసర్లు ఇషాంత్, ఉమేశ్‌ యాదవ్‌ తమ బౌన్స్‌తో ఇబ్బంది పెట్టినా వికెట్లు తీయలేకపోయారు. ఓవర్లు: 29, పరుగులు: 47, వికెట్లు: 2

సెషన్‌–2: రెన్‌షా, మార్ష్ నిలకడ
లంచ్‌ బ్రేక్‌ అనంతరం టర్నింగ్‌ ట్రాక్‌పై అశ్విన్, జడేజా తమ బంతులతో మరింత ఇబ్బంది పెట్టారు. దీంతో రెన్‌షా, షాన్‌ మార్‌‡్ష భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. 59వ ఓవర్‌లో ఉమేశ్‌ వేసిన బంతి మార్‌‡్ష బొటన వేలికి తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. అయితే అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా... భారత్‌ రివ్యూ కోరలేదు. అటు అద్భుత డిఫెన్స్‌తో భారత బౌలర్లను విసిగించిన రెన్‌షా 183 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జడేజా వేసిన 67వ ఓవర్‌ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన తను మూడో బంతిని అంచనా వేయడంలో బోల్తా పడ్డాడు. కచ్చితంగా ముందుకు వస్తాడని ఊహించిన జడేజా బంతిని లెగ్‌ సైడ్‌ వేశాడు. అలాగే వచ్చిన రెన్‌షా చివరి నిమిషంలో ప్యాడ్‌తో అడ్డుకుందామని భావించినా బంతి కీపర్‌ సాహా చేతుల్లోకి వెళ్లగా మెరుపు వేగంతో స్పందించిన అతను వికెట్లను గిరాటేశాడు. రెన్‌షా, మార్‌‡్ష మధ్య మూడో వికెట్‌కు 53 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత హ్యాండ్స్‌కోంబ్‌ (16) ఫోర్లతో చెలరేగినా జడేజా బౌలింగ్‌లో తను ఆడిన షాట్‌ను మిడ్‌ వికెట్‌లో అశ్విన్‌ సూపర్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. కింద పడే క్రమంలో బంతి చేజారినా తిరిగి తన భుజాలకు తాకి చేతుల్లోకి వచ్చింది. టీ విరామానికి ముందు చివరి బంతికి మిషెల్‌ మార్‌‡్షను ఇషాంత్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఓవర్లు: 35, పరుగులు: 76, వికెట్లు: 3

సెషన్‌–3: స్వల్ప జోరు
టీ బ్రేక్‌ అనంతరం షాన్‌ మార్ష్  రివ్యూ రూపంలో బతికిపోయాడు. 85వ ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ బంతికి మార్‌‡్షను ఎల్బీగా అంపైర్‌ అవుటిచ్చాడు. అయితే మార్ష్  మాత్రం రివ్యూకు వెళ్లాడు. బంతి ఆఫ్‌ స్టంప్‌కు ఆవలగా వెళ్లడంతో మార్ష్ ను నాటౌట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఓవర్‌లో మార్ష్ వికెట్‌ కోసమే ఇషాంత్‌ ఎల్బీ అప్పీల్‌ చేసినా అది నోబాల్‌గా తేలింది. ఇదే క్రమంలో మార్ష్ 162 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. 94వ ఓవర్‌లో వేడ్‌ ఎల్బీ అవుట్‌పై రివ్యూకు వెళ్లినా భారత్‌కు ఫలితం దక్కలేదు. నిలకడగా ఆడుతున్న మార్ష్ ను ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్‌లో స్టార్క్‌ ఇచ్చిన క్యాచ్‌ను సాహా మిస్‌ చేశాడు. మరో వికెట్‌ పడకుండా ఆసీస్‌ తమ రెండో రోజును ముగించింది. ఓవర్లు: 26, పరుగులు: 74, వికెట్‌: 1

స్మిత్‌... ఇషాంత్‌ ‘సయ్యాట’
తొలి టెస్టు సెంచరీ హీరో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను రెచ్చగొడుతూ పేసర్‌ ఇషాంత్‌ తన విచిత్ర హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో ఇషాంత్‌ వేసిన నాలుగో బంతిని స్మిత్‌ ఆడేందుకు ప్రయత్నించగా అది బ్యాట్‌ కింది నుంచి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ఇషాంత్‌ తన కళ్లను, నోటిని పెద్దగా చేస్తూ తల ఊపుతూ స్మిత్‌ను వెక్కిరించాడు. వెంటనే ఐదో బంతిని ఎదుర్కొనేందుకు స్మిత్‌ వికెట్లకు కుడి వైపు జరిగి డిఫెన్స్‌ ఆడిన అనంతరం బ్యాట్‌ను ఝుళిపిస్తూ ఇషాంత్‌ వైపు రెండడుగులు వేస్తూ అరిచాడు. దీనికి దీటుగా స్పందించిన ఇషాంత్‌ మరోసారి తన విచిత్ర హావభావాలతో ఆట పట్టించాడు. ఈ రెండు సందర్భాల్లో వికెట్ల వెనకాల ఫీల్డింగ్‌ చేస్తూ ఇదంతా గమనిస్తున్న కోహ్లి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. అటు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.

8 టెస్టుల్లో వార్నర్‌ వికెట్‌ను అత్యధికంగా ఎనిమిది సార్లు తీసిన బౌలర్‌ అశ్విన్‌. అలాగే అన్ని ఫార్మాట్లలో కలిపి వార్నర్‌ వికెట్‌ను అశ్విన్‌ పది సార్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు