అహో... ఆసీస్‌

17 Feb, 2018 01:04 IST|Sakshi
గప్టిల్‌

టి20 చరిత్రలోనే రికార్డు ఛేదన

కివీస్‌పై ఐదు వికెట్లతో గెలుపు

గప్టిల్‌ అద్భుత శతకం వృథా  

ఆక్లాండ్‌: బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సిక్స్‌ల వర్షం కురిపించి... ఫోర్ల వరద పారించి బ్యాట్స్‌మెన్‌ అభిమానులను అలరించారు. దాంతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన టి20 మ్యాచ్‌ పలు రికార్డులకు వేదికైంది. తొలుత న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 243 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 245 పరుగులు చేసి గెలుపొందింది. ఈ క్రమంలో టి20 చరిత్రలోనే అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా ఆసీస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (54 బంతుల్లో 105; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు), కొలిన్‌ మున్రో (33 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అదిరే ఆరంభాన్నిచ్చారు.

తొలి వికెట్‌కు 10.4 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు. గప్టిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్స్‌లతో విరుచుకు పడి 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. భారీ లక్ష్యం ముందున్నా ఆస్ట్రేలియా వెరవకుండా ఆడింది. ఓపెనర్లు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (24 బంతుల్లో 59; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), మాథ్యూ షార్ట్‌ (44 బంతుల్లో 76; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీర విజృంభణ చేశారు. 8.3 ఓవర్లలోనే 121 పరుగులు జోడించారు. మధ్యలో మ్యాక్స్‌వెల్‌ (14 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓ చేయి వేశాడు. లక్ష్యానికి కొద్ది దూరంలో షార్ట్‌ వెనుదిరిగినా ఆరోన్‌ ఫించ్‌ (14 బంతుల్లో 36; 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) దూకుడుతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే కంగారూలు మ్యాచ్‌ను ముగించారు. ఈ టోర్నీలో ఆసీస్‌కిది వరుసగా నాలుగో విజయం. షార్ట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

►ఈ మ్యాచ్‌తో గప్టిల్‌ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు (2,188) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మెకల్లమ్‌ (2,140) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. 
►టి20ల్లో ఆస్ట్రేలియా (245)దే రికార్డు ఛేదన. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్‌ (236/6; దక్షిణాఫ్రికాపై 2015లో) పేరిట ఉండేది.   
►ఒకే టి20 మ్యాచ్‌లో రెండు జట్ల తరఫున తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం ఇదే తొలిసారి.    

మరిన్ని వార్తలు