వారంతా ప్రమాదకరమే: ఫించ్‌

20 Nov, 2018 13:39 IST|Sakshi

బ్రిస్బేన్‌: తమ దేశ పర్యటనకు వచ్చిన భారత క్రికెట్‌ జట్టును ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత వరల్డ్‌ క్రికెట్‌లో టీమిండియా చాలా ప్రమాదకరమైన జట్టుగా ఫించ్‌ అభివర్ణించాడు. భారత జట్టు ఇప్పుడు ఏ ఒక్క ఆటగాడి మీదో ఆధారపడలేదని,  ఆ జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడు తమ తమ విధులను సక‍్రమంగా నెరవేరుస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నాడు.

‘భారత క్రికెట్‌ జట్టు చాలా పటిష్టంగా ఉంది. ప్రధానంగా వారి బలం బ్యాటింగ్‌. కోహ్లి, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌లు టీమిండియా బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా తమదైన రోజున చెలరేగిపోతారు. అటు యువకులు, ఇటు అనుభవంతో కూడిన క్రికెటర్లు భారత్‌ సొంతం. ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఘోరం పరాభవం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా జట్టంతా సమష్టిగా ఆడుతుందనే భావిస్తున్నా. భారత్‌తో సిరీస్‌ ద్వారా మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం. వరుస సిరీస్‌ల ఓటములు బాధిస్తున్నా టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో పూర్తి స్థాయిలో ఆడటానికి యత్నిస్తాం’ అని ఫించ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు