అబ్బే.. మేమెందుకు మారుతాం!

8 Dec, 2018 19:33 IST|Sakshi
రాహుల్‌ను రెచ్చగొడుతున్న కమిన్స్‌

స్లెడ్జింగ్‌కు పాల్పడిన ఆసీస్‌ బౌలర్‌

అడిలైడ్‌ : క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ అనగానే గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా ఆటగాళ్లు. మైదానంలో కవ్వింపు చర్యలతో ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొడుతూ.. అవసరమైతే మాటల యుద్దానికి దిగి ఏకాగ్రతను దెబ్బతీయాలని చూస్తారు. ఇలానే స్లెడ్జింగ్‌కు పాల్పడి గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భారీ మూల్యం చెల్లించుకున్నారు. స్లెడ్జింగ్‌తో వారు తవ్వుకున్న గొయ్యిలే వారే పడ్డారు. బాల్‌ట్యాంపరింగ్‌ వివాదంతో ప్రపంచం ముందు దోషులుగా నిలబడ్డారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా జట్టు కుదేలైంది. కీలక ఆటగాళ్లైన స్మిత్‌, డెవిడ్‌ వార్నర్‌లను దూరం చేసుకుని తీరని నష్టాన్ని చవిచూసింది. ఇంత జరిగినా.. కుక్కతోక వంకరే అన్నట్లు.. మేమెందుకు మారుతాం.. మేం ఆసీస్‌ క్రికెటర్లం కదా! అని అదే పోకడను ప్రదర్శిస్తున్నారు. భారత్‌తో సిరీస్‌కు ముందు ‘ మా ఆటను మేం ఆడుతాం.. స్లెడ్జింగ్‌కు పాల్పడం’అని నీతులు చెప్పిన ఆటగాళ్లు.. తొలి టెస్ట్‌లో కోహ్లిసేన ఆధిపత్యాన్ని సహించలేక సహనాన్ని కోల్పోతున్నారు. (చదవండి: కోహ్లిని ఎగతాళి చేసిన లియోన్‌!)

అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ తన నోటికి పనిచెప్పాడు. మూడో రోజు ఆటలో భాగంగా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కమిన్స్‌ వేసిన 11వ ఓవర్‌ నాలుగో బంతిని రాహుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా... అది బ్యాట్‌కు తగలకుండా కీపర్‌ చేతిలో పడింది. అయితే రాహుల్‌ పెవిలియన్‌వైపు చేతులను ఊపుతూ.. గ్లౌజ్‌లు తీసుకురమ్మని సైగ చేశాడు. అనంతరం మరుసటి బంతిని థర్డ్‌ మ్యాన్‌ దిశగా బౌండరీ తరలించాడు. దీంతో అసహనానికి గురైన కమిన్స్‌ రాహుల్‌కు సమీపంగా వచ్చి చేతులు ఊపుతూ.. తన నోటికి పనిచెప్పాడు. కానీ రాహుల్‌ అదేం పట్టించుకోనట్లు వ్యవహరించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన రాహుల్‌ రెండో ఇన్నింగ్స్‌లో పర్వాలేదనిపించాడు. 67 బంతుల్లో 47 పరుగులు చేసి గట్టి పునాది వేశాడు. దీంతో భారత్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. (చదవండి: మేము కోహ్లిలా మొరటోళ్లం కాదు!)

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 250 ఆలౌట్‌
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 235 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 151/3

మరిన్ని వార్తలు