ఆసీస్‌ క్రికెటర్లకు ప్రధాని స్వీట్‌ షాక్‌!

25 Oct, 2019 09:14 IST|Sakshi

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్‌ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తమ ఆటగాళ్ల కోసం వాటర్‌ బాయ్‌ అవతారం ఎత్తారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం లసిత్‌ మలింగ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆదివారం అడిలైడ్‌ వేదికగా మొదలుకానున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కంగారూ(ప్రైమ్‌ మినిస్టర్‌ XI)- లంక జట్లు గురువారం వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి. కాన్‌బెర్రాలోని ఓవల్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో... ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకు వచ్చారు. మ్యాచ్‌ 16వ ఓవర్‌లో తమ క్రికెటర్ల కోసం వాటర్‌ బాటిల్స్‌ తీసుకువచ్చారు. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్‌ ఆటగాళ్లు స్వీట్‌ షాక్‌కు గురయ్యారు. 

ఇక ప్రధాని రాకను చూసి కొంతమంది చిరునవ్వులు చిందించగా.. మరికొంత మంది ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. కాగా తెలుపు రంగు షర్టు, నల్లరంగు ప్యాంటు ధరించిన స్కాట్‌ మారిసన్‌.. ఆసీస్‌ క్రికెట్‌ జట్టు క్యాప్‌ను ధరించి మైదానంలోకి రావడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో... ‘ఆసీస్‌ క్రికెట్లకు వాటర్‌ బాయ్‌గా సేవలు అందించి ప్రధాని స్కాట్‌ మారిసన్‌.. ఈ ప్రపంచంలో ఏ పనిని కూడా తక్కువగా చూడకూడదని నిరూపించారు. మీరు గ్రేట్‌ సార్‌. హాట్సాఫ్‌’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన శ్రీలంక యువజట్టు.. ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టును వైట్‌వాష్‌ చేసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక అదే జోష్‌లో పూర్తిస్థాయి జట్టుతో ఆస్ట్రేలియాకు చేరుకున్న మలింగ సేన కంగారూలను సైతం ఓడించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు... ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న ఆసీస్‌ టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలి 20 నాటికి జట్టుతో చేరే అవకాశం ఉందని కోచ్‌ జస్టిన్‌ లింగర్‌ పేర్కొన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు పూర్తి సిద్ధంగా ఉన్నామని.. పర్యాటక జట్టుపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.  
     

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా