గట్టెక్కుతారా!

9 Jan, 2015 23:56 IST|Sakshi
గట్టెక్కుతారా!

మూడు రోజుల పాటు బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్న సిడ్నీ పిచ్‌పై నాలుగో రోజు అనూహ్యంగా బంతి తిరిగింది. అయినా ఆస్ట్రేలియా వన్డే తరహాలో ఆడి మ్యాచ్‌ని ఫలితం దిశగా తీసుకెళ్లింది.  ఇప్పటికే 348 పరుగుల ఆధిక్యంలో ఉన్న స్మిత్ సేన ఇదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌కు సవాల్ విసిరే అవకాశం ఉంది.
 
 అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత లక్ష్యం 364... డ్రా చేసుకుంటే గొప్ప అనుకున్న మ్యాచ్‌లో కోహ్లి సేన విజయం కోసం ప్రయత్నించి ఓడిపోయింది. ఆ పిచ్‌తో పోలిస్తే ప్రస్తుతం సిడ్నీ పిచ్ మీద బంతి మరింత తిరుగుతోంది. అడిలైడ్‌లో స్పిన్నర్ లయోన్ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఇప్పుడూ లయోన్‌పై నమ్మకంతో ఆసీస్ జట్టు భారత్‌ను ఊరిస్తోంది.
 
దూకుడు మంత్రం పఠించే కోహ్లి విజయం కోసం ప్రయత్నిస్తాడా? లేదా ఏదోలా రోజు లాగించి డ్రా చేసుకుంటారా? లేక స్పిన్ వికెట్‌పై లయోన్‌కు మ్యాచ్ అప్పగిస్తారా? సిడ్నీ అంటేనే సంచలనాలకు మారుపేరు. 2007-08 సిరీస్‌లోనూ సిడ్నీలో హై డ్రామా జరిగింది. డ్రా అవుతున్న మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో క్లార్క్ మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను గెలిపించాడు. ఈసారి ఏం జరగబోతోంది?

 
 సిడ్నీ: నాలుగో టెస్టు నాలుగో రోజులో ఒకే ఒక్క సెషన్ మ్యాచ్‌ను తలకిందులు చేసింది. దీంతో అప్పటి దాకా డ్రా దిశగా వెళ్లిన మ్యాచ్‌లో ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఖరి సెషన్‌లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. వన్డే తరహా ఆటతీరుతో ఓవర్‌కు ఆరుకుపైగా రన్‌రేట్‌తో పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోజర్స్ (77 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించాడు. అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. ఓవరాల్‌గా ఆసీస్ ప్రస్తుతం 348 పరుగుల ఆధిక్యంలో ఉంది.  


 స్కోరు వివరాలు
 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్
 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్(సి) అండ్ (బి) స్టార్క్ 110; రోహిత్ (బి) లయోన్ 53; కోహ్లి (సి) రోజర్స్ (బి) హారిస్ 147; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) వాట్సన్ 13; రైనా (సి) హాడిన్ (బి) వాట్సన్0; సాహా (సి) స్మిత్ (బి) హాజెల్‌వుడ్ 35; అశ్విన్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 50; భువనేశ్వర్ (సి) వాట్సన్ (బి) లయోన్ 30; షమీ నాటౌట్ 16; ఉమేశ్ (సి) హాడిన్ (బి) హారిస్ 4; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (162 ఓవర్లలో ఆలౌట్) 475.


 వికెట్ల పతనం: 1-0; 2-97; 3-238; 4-292; 5-292; 6-352; 7-383; 8-448; 9-456; 10-475
 బౌలింగ్: స్టార్క్ 32-7-106-3; హారిస్ 31-7-96-2; హాజెల్‌వుడ్ 29-8-64-1; లయోన్ 46-11-123-2; వాట్సన్ 20-4-58-2; స్మిత్ 4-0-17-0.


 ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: రోజర్స్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 56; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 4; వాట్సన్ (బి) అశ్విన్ 16; స్మిత్ ఎల్బీడబ్ల్యూ (బి) షమీ 71; మార్ష్ (సి) విజయ్ (బి) అశ్విన్ 1; బర్న్స్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 66; హాడిన్ బ్యాటింగ్ 31; హారిస్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (40 ఓవర్లలో 6 వికెట్లకు) 251.


 వికెట్ల పతనం: 1-6; 2-46; 3-126; 4-139; 5-165; 6-251;
 బౌలింగ్: భువనేశ్వర్ 8-0-46-1; అశ్విన్ 19-2-105-4; షమీ 6-0-33-1; ఉమేశ్ 3-0-45-0; రైనా 4-0-18-0.
 
 సెషన్-1  నిలబడ్డ అశ్విన్
 342/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన కోహ్లి, సాహా (35) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. వ్యక్తిగత స్కోరుకు మరో ఏడు పరుగులు జోడించి కెప్టెన్ అవుటయ్యాడు. అప్పటికీ భారత్ ఫాలోఆన్ మార్క్‌కు మరో 21 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్, సాహా ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన అశ్విన్ ఏమాత్రం తడబడకుండా ఆడాడు. వీలైనంత ఎక్కువసేపు బ్యా టింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎక్కువగా సింగిల్స్ తీయడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. సాహా షార్ట్ పిచ్‌లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందులుపడ్డాడు. చివరకు ఇన్నింగ్స్ 131వ ఓవర్‌లో హాజెల్‌వుడ్ వేసిన షార్ట్ బంతిని టచ్ చేసి స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన భువనేశ్వర్.. అశ్విన్‌కు మంచి సహకారం అందించడంతో మరో వికెట్ పడకుండా లంచ్‌కు వెళ్లారు.  
 ఓవర్లు: 29; పరుగులు: 65; వికెట్లు: 2
 
 సెషన్-2  ఆకట్టుకున్న భువీ
 లంచ్ తర్వాత అశ్విన్, భువనేశ్వర్ క్రమంగా జోరు పెంచారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆశించిన స్థాయిలో ఆధిక్యం తగ్గుముఖం పట్టినా ఊహించని రీతిలో భువీ అవుటయ్యాడు. వేగంగా దూసుకొచ్చిన లయోన్ బంతి భువనేశ్వర్ బ్యాట్‌ను తాకి స్లిప్‌లో వాట్సన్ చేతిలోకి వెళ్లింది. బంతి నేలకు తాకలేదని రీప్లేలో స్పష్టం కావడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అశ్విన్, భువీ మధ్య ఎనిమిదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. షమీ (16 నాటౌట్)తో జత కలిసిన అశ్విన్ మరో ఐదు ఓవర్ల తర్వాత అవుట్‌కాగా, ఆ కొద్దిసేపటికే ఉమేశ్ (4) వెనుదిరిగాడు. ఓవరాల్‌గా భారత్ 27 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను రెండో ఓవర్‌లోనే వార్నర్ (4)ను అశ్విన్ అవుట్ చేశాడు. అయితే రోజర్స్, వాట్సన్ (16) నిలకడగా ఆడి టీకి వెళ్లారు.
 ఓవర్లు: 18; పరుగులు: 68; వికెట్లు: 3 (భారత్)
 ఓవర్లు: 6; పరుగులు: 38; వికెట్లు: 1 (ఆసీస్)
 
 సెషన్-3  స్మిత్, బర్న్స్ జోరు
 టీ తర్వాత భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. లైన్ అండ్ లెంగ్త్ తప్పడంతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రనౌట్ నుంచి బయటపడిన వాట్సన్‌ను విరామం తర్వాత రెండో ఓవర్‌లోనే అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో వచ్చిన స్మిత్ ఊహించని రీతిలో వేగంగా బ్యాటింగ్ చేశాడు.  ఈ క్రమంలో 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత వేగంగా ఆడే క్రమంలో రోజర్స్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 15.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. తర్వాత స్వల్ప వ్యవధిలో షాన్ మార్ష్ (1), స్మిత్‌లు అవుటయ్యారు. అప్పటికే ఆసీస్ ఆధిక్యం 250 పరుగులు దాటింది. హాడిన్‌తో కలిసిన బర్న్స్ ఒక్కసారిగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ 39 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు 8.4 ఓవర్లలో 86 పరుగులు సమకూర్చడంతో ఆసీస్ ఆధిక్యం 300లకు చేరింది. చివరి ఓవర్ నాలుగో బంతికి బర్న్స్ అవుటైనా అప్పటికే నష్టం జరిగిపోయింది.
 ఓవర్లు: 34; పరుగులు: 213; వికెట్లు: 5
 
 చివరి సెషన్‌లో మేం భారీగా పరుగులు సమర్పించుకున్నాం. బ్యాట్స్‌మెన్ కూడా కొన్ని మంచి షాట్లు ఆడారు. కొత్త బంతితో మా ఆరంభం అసలు బాగాలేదు. లేకపోతే మ్యాచ్ మరోలా ఉండేది. శనివారం మేం కూడా అడిలైడ్‌లో ఆడినట్లుగా ఆడాలి. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలని భావించా. పిచ్ నుంచి పెద్ద సహకారం లేకపోవడంతో పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. జట్టు కోసం నేను కొన్ని అవకాశాలను సృష్టించాలనుకున్నా. అలా చేయడంతో నాలుగు వికెట్లు తీయగలిగా. మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆసీస్ ఆటగాళ్లు కూడా బాగా బ్యాటింగ్ చేశారు. ఓవర్‌నైట్ స్కోరుతో డిక్లేర్ చేస్తే మేం కూడా ఫలితం కోసం ఆడతాం.                   -అశ్విన్ (భారత స్పిన్నర్)
 
 ఐదో రోజు ఆటలో స్పిన్నర్లు కీలకం. వికెట్ బాగా టర్న్ అవుతోంది. బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కేవలం 10 అవకాశాల కోసం మేం ఎదురుచూస్తున్నాం. స్పిన్‌తోనే పది వికెట్లు తీయాలని భావిస్తున్నాం. భిన్నమైన బౌన్స్, రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నిస్తాం.  డిక్లరేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాలలో నా పాత్ర ఉండదు. ఇది కెప్టెన్‌కు సంబంధించిన అంశం. జట్టును మంచి స్థితిలో నిలిపినందుకు ఆనందంగా ఉంది.  మ్యాచ్ గెలవడానికి మాకు చాలా అవకాశాలున్నాయి. స్మిత్ కూడా అద్భుతంగా ఆడాడు. అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి.                    -బర్న్స్ (ఆసీస్ బ్యాట్స్‌మన్)
 
 టెస్టు సిరీస్‌లో ఎనిమిదిసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
 
 భారత్ తరఫున టెస్టుల్లో 100 వికెట్లు, వెయ్యి పరుగులు పూర్తి చేసిన 9వ ఆల్‌రౌండర్ అశ్విన్.
 
 ప్రపంచ క్రికెట్‌లో వేగంగా 100 వికెట్లు, వెయ్యి పరుగులు(24 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన మూడో ఆటగాడు అశ్విన్. ఇంగ్లండ్ ఆటగాడు బోథమ్ (21 మ్యాచ్‌లు) పేరిట ఈ రికార్డు ఉంది.
 
 23 ఏళ్లలో ఆసీస్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన రెండో భారత స్పిన్నర్ అశ్విన్.
 
 ఈ సిరీస్‌లో ఉమేశ్ 4.66 రన్‌రేట్‌ను నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఆసీస్‌లో ఆడిన భారత బౌలర్లలో ఇదే చెత్త ప్రదర్శన. ఓవరాల్‌గా మూడోది. ఎడ్వర్డ్స్, బ్రెట్ లీ ముందున్నారు.
 
 250 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆసీస్ నాలుగో వికెట్ కీపర్‌గా హాడిన్ రికార్డులకెక్కాడు. టెస్టు క్రికెట్‌లో ఏడోవాడు.

మరిన్ని వార్తలు