ట్వంటీ 20 లో రికార్డ్ ఛేజింగ్

16 Feb, 2018 15:41 IST|Sakshi

కివీస్ ఓపెనర్ గప్టిల్ మెరుపు సెంచరీ వృథా

ట్వంటీ20 చరిత్రలో ఆస్ట్రేలియా సరికొత్త అధ్యాయం

243 టార్గెట్‌ను ఛేదించి విండీస్ రికార్డ్ బద్ధలుకొట్టిన ఆసీస్

సాక్షి, స్పోర్ట్స్‌: ట్వంటీ20 చరిత్రలో రికార్డ్ ఛేజింగ్ ను ఆస్ట్రేలియా సాధ్యం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన పరుగుల పోరులో ఆసీస్ జట్టునే విజయం వరించింది. కివీస్ విసిరిన 244 పరగుల లక్ష్యాన్ని మరో ఏడే బంతులుండగానే అలవోకగా ఛేదించి ఆసీస్ జట్టు చరిత్ర సృష్టించింది.

టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేయగా న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ (54 బంతుల్లో 106, 6ఫోర్లు, 9 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ మున్రో (33 బంతుల్లో 76: 6ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24 బంతుల్లో 59: 4ఫోర్లు, 5 సిక్సర్లు), షార్ట్ (44 బంతుల్లో 76: 8ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. 121 పరుగుల వద్ద వార్నర్ ను కివీస్ బౌలర్ సోదీ బౌల్డ్ చేశాడు. ఆపై క్రిస్ లిన్ (18), మాక్స్‌వెల్ (14 బంతుల్లో 31: 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి షార్ట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో అరోన్ ఫించ్ (14 బంతుల్లో 36: 3ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో 18.5 ఓవర్లలో మరో 7 బంతులుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ట్వంటీ20 చరిత్రలో రికార్డు ఛేజింగ్‌ ఆసీస్ (245/5) పేరిట నమోదైంది.

గతంలో ఈ ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాపై 231 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో విండీస్ ఛేదించింది. కాగా నేడు కివీస్‌తో జరిగిన టీ20లో ఆసీస్ జట్టు 243 పరగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 2015లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 231 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి మరో నాలుగు బంతులు మిగిలుండగానే విండీస్ విజయం సాధించింది.

మరిన్ని వార్తలు