టెస్టులు ఇక చాలు: వాట్సన్

6 Sep, 2015 18:28 IST|Sakshi
టెస్టులు ఇక చాలు: వాట్సన్

ఆస్ట్రేలియా టెస్టు జట్టులో మరో వికెట్ పడింది. టెస్ట్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తర్వాత టీమ్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. యాషెస్ సిరీస్ ముగిసిన వెంటనే మైకేల్ క్లార్క్ టెస్టుల నుంచి తప్పుకోగా... తాజాగా తాను కూడా టెస్టుల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వాట్సన్ తెలిపాడు.  ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డే సందర్భంగా గాయపడిన వాట్సన్... అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్య పరిచింది.

ఇటీవల కాలంలో వరస గాయాలు.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వాట్సన్.. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన సమయమని అన్నాడు. చిరకాల ప్రత్యర్ధులతో యాషెస్ సిరీస్ లోనూ వాట్సన్ ప్రదర్శన పేవలంగానే సాగింది. తొలి మ్యాచ్ లో ఆడిన ఈ 34ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆ మ్యాచ్ లో కేవలం తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులు,  రెండో ఇన్సింగ్స్ లో 19 పరుగులు మాత్రమే చేశాడు.  ఇక బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా తీయ లేక పోయాడు. ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్ మెంట్ మిగతా సిరీస్ కు వాట్సన్ ను పక్కన పెట్టింది.  తాజాగా వన్డే సిరీస్ లో గాయపడ్డ వాట్సన్ పూర్తి సిరీస్ కు దూరం కానున్నాడు.

రిటైర్మెంట్ గురించి ఉద్వేగంగా మాట్లాడిన వాట్సన్ ఐదు రోజుల ఫార్మెట్ నుంచి తప్పుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకొచ్చాడు. తనలో టెస్ట్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఇక ఎంత మాత్రం లేదని అన్నాడు. శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా.. టెస్ట్ల్ లు ఆడే సత్తా తనలో లేదని చెప్పుకొచ్చాడు. టెస్ట్ ల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తనకు, తన కుటుంబానికే కాక.. ఆస్ట్రేలియా టీమ్ కు కూడా మంచిదని వివరించాడు.

ఆస్ట్రేలియా తరఫున సిడ్నీలో పాకిస్తాన్ పై 2005 జూన్ లో టెస్ట్ ఆరంగేట్రం చేసిన వాట్సన్ తన కెరీర్ లో  59 టెస్టులు ఆడాడు. ఒక టెస్ట్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2009 యాషెస్ సిరీస్ లో రాణించిన వాట్సన్ 59 టెస్ట్ లు  35.19 యావరేజ్ తో 3,731 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.  ఇక బౌలింగ్ లో 33.68 యావరేజ్ తో 75 వికెట్లు తీశాడు. కెరీర్ ఆరంభంలోనూ... చివరి రోజుల్లోనూ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా వ్యవహరించిన ఈ ఆసిస్ ఆల్ రౌండర్ ఓపెనింగ్ పొజిషన్ ను బాగా ఎంజాయ్ చేశాడు. ఓపెనర్ గా 29 మ్యాచ్ లు ఆడిన వాట్సన్ 55.12 యావరేజ్ తో 2,049 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

గత కొంత కాలంగా వరస గాయాలతో ఇబ్బంది పడుతున్న వాట్సన్ ఇక పొట్టి ఫార్మాట్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపాడు.  టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగటం తన కెరీర్ కి మంచిదని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. వన్డేలు, టీ20లకు పరిమితం కావడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం ఎంతో భావోద్వేగాలతో కూడుకున్నదని చెప్పాడు.

మరిన్ని వార్తలు