ఇంగ్లాండ్‌ చిత్తు.. యాషెస్‌ ఆసీస్‌ కైవసం

8 Jan, 2018 14:18 IST|Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ చిత్తుగా ఓడిపోయింది. 123 పరుగులు, ఇన్నింగ్స్‌ తేడాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ లో ఇంగ్లాండ్‌ 346 పరుగులు సాధించగా.. మార్ష్‌ బ్రదర్స్‌ విధ్వంసంతో ఆస్ట్రేలియా 649/7(డిక్లేర్డ్‌) భారీ స్కోర్‌ను సాధించిన విషయం తెలిసిందే. 

దీంతో ఇంగ్లాండ్‌ ముందు అసీస్‌ 303 పరుగుల ఆధిక్యం ఉంచినట్లయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 9 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఆటగాడు జోయ్‌ రూట్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. మైదానంలో దిగిన అతను మరోసారి గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.  దీంతో ఆసీస్‌ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. 3-0 ఇదివరకే ఆధిక్యంతో ఉన్న ఆసీస్‌ యాషెస్‌ ట్రోఫీని కైవసం చేసుకున్నట్లయ్యింది. 

అంతకు ముందు షాన్‌ మార్ష్‌ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్‌ మార్ష్‌ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో ఇంగ్లాండ్‌ బౌలర్లను ఊచకోత కోయటంతో ఆసీస్‌ భారీ స్కోర్‌ సాధించగలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ ఆసీస్‌ బౌలర్లను తట్టుకోలేకపోయింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో గాయపడిన రూట్‌దే అత్యధిక పరుగులు(58) కావటం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కుమ్మిన్స్ 4 వికెట్లు, నాథన్ కౌల్టర్-నైల్ 3 వికెట్లు తీశారు.

షాన్‌ బతికిపోయాడు... 

పాయింట్‌ దిశగా బంతిని పంపిన మిచెల్‌ మార్ష్‌ సెంచరీ సంబరాల్లో పడి రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్‌ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్‌ మార్ష్‌ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు. లేకుంటే రన్‌ అవుట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. 

మరిన్ని వార్తలు