సాధారణ లక్ష్యమే.. ఇంగ్లండ్‌ ఛేదించేనా?

11 Jul, 2019 18:53 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 224 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  ఇంగ్లండ్‌ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశారు. ప్రధానంగా ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌కు చుక్కలు చూపించగా,  ఆదిల్‌ రషీద్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడు. వీర్దిరూ తలో మూడు వికెట్లు సాధించి ఆసీస్‌ పతనాన్ని శాసించారు. ఆర్చర్‌కు రెండు వికెట్లు లభించగా, మార్క్‌ వుడ్‌ వికెట్‌ తీశాడు.( ఇక్కడ చదవండి: బంతి తగిలి అలెక్స్‌ క్యారీ విలవిల)

 స్టీవ్‌ స్మిత్‌(85; 119 బంతుల్లో 6 ఫోర్లు), అలెక్స్‌ క్యారీ(46; 70 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు మిచెల్‌ స్టార్క్‌(29; 36 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(22; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు అరోన్‌ ఫంచ్‌ గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, డేవిడ్‌ వార్నర్‌(9) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత హ్యాండ్స్‌కాంబ్‌(4) తీవ్రంగా నిరాశపరిచాడు.

ఆ తరుణంలో స్మీవ్‌ స్మిత్‌-అలెక్స్‌ క్యారీల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది.  వీరిద్దరూ 103 పరుగులు జోడించిన తర్వాత క్యారీ నాల్గో వికెట్‌గా ఔట్‌ కాగా, ఆపై వెంటనే స్టోయినిస్‌ డకౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. దాంతో ఆసీస్‌ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. కాగా, మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునఃనిర్మించాడు స్మిత్‌. ఈ జోడి 39 పరుగులు జత చేసిన తర్వాత మ్యాక్సీ కూడా ఔట్‌ కాగా, కాసేపటికి కమిన్స్‌ పెవిలియన్‌ చేరాడు. స్మిత్‌-‍స్టార్క్‌ల జోడి సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌ రెండొందల మార్కును చేరింది. అయితే బట్లర్‌ అద్భుతమైన రనౌట్‌తో స్మిత్‌ను ఔట్‌ చేయగా, వెంటనే స్టార్క్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. ఇక చివరి వికెట్‌గా బెహ్రాన్‌డార్ఫ్‌ ఔట్‌ కావడంతో ఆసీస్‌ 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.

>
మరిన్ని వార్తలు