టీమిండియా లక్ష్యం 237

2 Mar, 2019 17:03 IST|Sakshi

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా టాపార్డర్‌ ఆటగాళ్లలో ఉస్మాన్‌ ఖవాజా(50), మ్యాక్స్‌వెల్‌(40)లు రాణించగా, స్టోయినిస్‌(37) ఓ మోస్తరుగా ఆకట్టుకోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖవాజా-స్టోయినిస్‌ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. వీరిద‍్దరూ 87 పరుగులు జత చేసిన తర్వాత స్టోయినిస్‌(37) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.
ఇక్కడ చదవండి: (‘వంద’లో సున్నా..!)

ఆపై కాసేపటికి హాఫ్‌ సెంచరీ సాధించిన ఖావాజా సైతం పెవిలియన్ బాట పట్టాడు.కాగా, హ్యాండ్స్‌ కాంబ్‌-మ్యాక్స్‌వెల్‌ జంట 36 పరుగులు జోడించింది. నాల్గో వికెట్‌గా హ్యాండ్స్‌ కోంబ్‌(19) ఔట్‌ కాగా, ఐదో వికెట్‌గా టర్నర్‌(21) పెవిలియన్‌ చేరాడు. ఇక కుదరుగా ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ను షమీ బోల్తా కొట్టించాడు. చివర్లో కౌల్టర్‌ నైల్‌(28), అలెక్స్‌ క్యారీ(36 నాటౌట్‌)లు జాగ్రత్తగా ఆడటంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా, కేదర్‌ జాదవ్‌కు వికెట్ దక్కింది.

>
మరిన్ని వార్తలు