కంగారుపెట్టించిన భారత బౌలర్లు

1 Oct, 2017 17:14 IST|Sakshi

సాక్షి, నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బౌలర్లు రాణించారు.  యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (3-38) చెలరేగగా.. పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌లు పరుగుల రాకుండా కట్టడిచేయడంతో ఆసీస్‌ భారత్‌కు 243 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డెవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌లు మంచి శుభారంభాన్ని అందించారు. దూకుడు మీద ఉన్న ఈ జంటను హార్దిక్ పాండ్యా అడ్డుకున్నాడు. భారీ షాట్ కు యత్నించిన ఫించ్(32).. బూమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 66 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో వార్నర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ దశలో వార్నర్‌ 56 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. వార్నర్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మరుసటి బంతికే కెప్టెన్ స్టీవ్ స్మిత్(16) జాదవ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో 12 బంతుల వ్యవధిలోనే అక్సర్‌ బౌలింగ్‌లో వార్నర్ ‌(53) కూడా పెవిలియన్‌ చేరడంతో ఆసీస్‌ పరుగుల వేగం మందగించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హ్యాండ్స్‌ స్కోంబ్‌(13) కూడా విఫలమయ్యాడు. దీంతో ఆసీస్‌ 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్, స్టోయినీస్‌లు నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్‌ 200 పరుగుల మార్కును దాటగలిగింది. ట్రావిస్‌ హెడ్(42)‌ను అక్షర్‌ అవుట్‌ చేయగా స్టోయినీస్‌(46)ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు.  డెత్‌ ఓవర్లో బుమ్రా- భువనేశ్వర్‌లు పరుగులు రాకుండా కట్టడి చేశారు. దీంతో వేడ్‌(20) భారీ షాట్‌కు ప్రయత్నించి బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. చివర్లో ఫాల్కనర్‌(12) రనౌట్‌ అవ్వగా కౌల్టర్‌ నీల్‌ భువీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్‌  పటేల్‌కు మూడు, బుమ్రాకు రెండు, జాదవ్‌, పాండ్యా, భువనేశ్వర్‌లకు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు