టీమిండియా లక్ష్యం 287

17 Dec, 2018 12:02 IST|Sakshi

పెర్త్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ ముందు సాధారణ లక్ష్యమే ఉంచింది. ఈ రోజు ఆటలో ఆసీస్‌ లంచ్‌ వరకూ కాస్త మెరుగ్గా ఆడినప్పటికీ ఆపై వరుసగా వికెట్లను చేజార్చుకుంది భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేసి ఆసీస్‌ కట్టడి చేయడంలో సఫలయ్యారు. మహ్మద్‌ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్‌ శర్మ వికెట్‌ తీశాడు.

132/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌ నిలకడగా ఆడే యత్నం చేసింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు ఉస్మాన్‌ ఖాజా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌లు అత్యంత జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. పరుగులు మాటను పక్కను పెట్టి టీమిండియా బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టారు. దాంతో లంచ్‌ సమయం వరకూ టీమిండియా వికెట్‌ కూడా సాధించలేకపోయింది. ఆపై మహ్మద్‌ షమీ రెచ్చిపోయి బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. టిమ్‌ పైన్‌(37), అరోన్‌ ఫించ్‌(25), ఉస్మాన్‌ ఖవాజా(72)లను కొద్ది పాటి వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. 

పైన్‌, ఫించ్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసిన షమీ.. మరో మూడు ఓవర్లలోపే ఖవాజాకు షాకిచ్చాడు.గుడ్‌ లెంగ్త్‌, బౌన్సర్లు, అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతులతో షమీ తన బౌలింగ్‌లో పదునుచూపించాడు.  అటు తర్వాత బూమ్రా బౌలింగ్‌లో కమిన్స్‌(1) ఔట్‌ కావడంతో ఆసీస్‌ 198 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. 192 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్‌.. 198 పరుగుల వద్ద మరో రెండు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇక చివరి రెండు వికెట్లలో షమీ, బూమ్రాలు తలో వికెట్‌ సాధించడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆఖరి వికెట్‌కు స్టార్క్‌(14)- హజల్‌వుడ్‌(17 నాటౌట్‌)ల జోడి 36 పరుగులు జోడించడంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 326 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 243 ఆలౌట్‌

భారత్ తొలి ఇన్నింగ్స్‌ 283 ఆలౌట్‌

మరిన్ని వార్తలు