టీమిండియాకు స్వల్ప లక్ష్యం

27 Mar, 2017 16:44 IST|Sakshi
టీమిండియాకు స్వల్ప లక్ష్యం

ధర్మశాల: భారత్ తో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఈ రోజు ఆటలో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 137  పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ముందు మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచకల్గింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో మ్యాక్స్ వెల్(45) మినహా ఎవరూ రాణించలేదు. రెన్ షా(8), డేవిడ్ వార్నర్(6),స్టీవ్ స్మిత్(17), హ్యాండ్ స్కాంబ్(18), షాన్ మార్ష్(1), కమిన్స్ (12), ఓకీఫ్(0),లయన్(0)లు తీవ్రంగా నిరాశపరిచారు.ఈ రోజు ఆటలో భాగంగా రెండు, మూడు సెషన్లలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఆసీస్ ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసి పైచేయి సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ను భారత్ బౌలర్లు చావు దెబ్బ కొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆసీస్ కు షాకిచ్చారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ లు తలో మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్ కు వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయాన్ని ఆసీస్ అడ్డుకోవడం  కష్టమే.

పరుగు వ్యవధిలో మూడు వికెట్లు..

ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 97 పరుగులకు ఐదు వికెట్లును, 106 పరుగులకు ఆరు వికెట్లను చేజార్చుకుని తీవ్ర ఇబ్బందుల్లో పడింది.ఇక్కడ కమిన్స్ -వేడ్లు కాస్త భారత్ బౌలింగ్ ను నిలువరించడంతో వికెట్ల పతనం ఆగింది. అయితే 121 పరుగుల వద్ద కమిన్స్ ఏడో వికెట్ గా అవుటైన తరువాత ఆసీస్ మరొకసారి తడబడింది. ఇక్కడ పరుగు వ్యవధిలో ఆసీస్ మూడు వికెట్లను నష్టపోవడంతో ఇక తేరుకోలేకపోయింది.


అంతకుముందు 248/6 ఓవర్ నైట్  స్కోరుతో సోమవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆదిలో నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా (63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, వృద్ధిమాన్ సాహా(31;102 బంతుల్లో 2ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.  ఆసీస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న జడేజా-సాహాలు జోడి స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి 96 విలువైన భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత జడేజా అవుటయ్యాడు.ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బంతని లోపలికి ఆడిన జడేజా బౌల్డ్ అయ్యాడు. ఆపై  భువనేశ్వర్ కుమార్, సాహా, కల్దీప్ యాదవ్లు కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో భారత్ కు 32 పరుగుల స్పల్ప ఆధిక్యం మాత్రమే లభించింది.

 

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్  137 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్  332 ఆలౌట్

మరిన్ని వార్తలు