-

ఆసీస్‌ ఎంతగా దిగజారిందంటే..

18 Jun, 2018 14:35 IST|Sakshi

దుబాయ్‌: ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా.. గత కొంతకాలంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. దాదాపు ఏడాది వ్యవధిలో 15 వన్డేలు ఆడిన ఆసీస్‌ 13 మ్యాచ్‌లు ఓటమి పాలైందంటే ఆ జట్టు రోజు రోజుకూ ఎంతగా దిగజారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. 2017లో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించిన ఆసీస్‌.. ఆపై వరుసగా మూడు ద్వైపాక్షిక సిరీస్‌లను చేజార్చుకుంది. న్యూజిలాండ్‌, భారత్‌, ఇంగ్లండ్‌ జట్లతో వరుసగా జరిగిన మూడు సిరీస్‌లను ఆసీస్‌ కోల్పోయింది. మరొకవైపు చాంపియన్స్‌ ట్రోఫీలో గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించడం కూడా ఆసీస్‌ ఎదుర్కొంటున్న కష్ట సమయానికి ఉదాహరణగా చెప్పొచ్చు.

తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు పరాజయం ఎదురుకావడంతో ఆ జట్టు ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ఆరో స్థానానికి పడిపోయింది. ఫలితంగా 34 ఏళ్ల తర్వాత తొలిసారి వన్డేల్లో ఆరో స్థానానికి ఆసీస్‌ పరిమితమైంది. చివరిసారి 1984లో ఆసీస్‌ ఇలానే ఆరో స్థానంలో నిలవగా, ఆపై ఇంతకాలానికి అదే స్థానానికి పరిమితమైంది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా, భారత్‌ రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌లు ఉండగా, ఆసీస్‌ ఆరో స్థానంలో నిలిచింది.
 

మరిన్ని వార్తలు