షమీ, జడేజాలకు చోటు?

19 Dec, 2015 00:40 IST|Sakshi
షమీ, జడేజాలకు చోటు?

* రేసులో ఇషాంత్, విజయ్    
* ఆసీస్‌తో వన్డే, టి20లకు జట్టు ఎంపిక నేడు

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులోనూ చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరిలో ఆసీస్‌తో జరగనున్న ఐదు వన్డేలు, మూడు టి20ల కోసం నేడు (శనివారం) సెలక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. గాయంతో దూరమైన పేసర్ మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలతో పాటు బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ కూడా రేసులో ఉన్నారు.

జట్టు ఎంపిక టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే జరుగుతుందని క్రికెట్ వర్గాల సమాచారం. రెండు ఫార్మాట్లకు కలిపి 12 మంది ఎంపికకానున్నారు. టెస్టుల్లో రాణిస్తున్న ఇషాంత్.. వన్డేలు ఆడక ఏడాది కావొస్తుంది. సఫారీలతో సిరీస్‌కు ఎంపికైనా కాలిపిక్క గాయంతో విశ్రాంతికి పరిమితమయ్యాడు. ప్రపంచకప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.

ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే షమీ ఫిట్‌గా ఉంటే చాలని సెలక్టర్లు భావిస్తుండటంతో అతని చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిలకడలేని పేస్ బౌలింగ్‌కు షమీ రాకతో మరింత బలం చేకూరుతుందని వాళ్ల భావన. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్, మోహిత్ శర్మ మిగతా స్థానాలకు ఎంపికకానున్నారు.
 
మూడో స్పిన్నర్ ఉంటాడా?
ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్‌తో పాటు రెండో స్పిన్నర్‌గా జడేజా వైపే సెలక్టర్లు మొగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ ప్రొటీస్‌పై 23 వికెట్లతో పాటు కీలక సమయాల్లో మొత్తం 109 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇక ప్రధాన చర్చ అంతా మూడో స్పిన్నర్‌ను తీసుకుంటారా? లేదా? అన్నది తేలాలి. ఆసీస్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఉండకపోవచ్చు.

ఒకవేళ తీసుకుంటే మాత్రం వెటరన్ హర్భజన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాల మధ్య పోటీ ఉంటుంది. జడేజా లెఫ్టార్మర్ కావడంతో సహజంగానే అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కకపోవచ్చు. ఇక మిగిలింది హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలలో ఎవరికి  స్థానం దక్కుతుందో చూడాలి.
 
రాయుడుకు కష్టమే!
గతేడాది కాలంగా అంబటి రాయుడు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. దీంతోపాటు మిడిలార్డర్ కోసం విజయ్ గట్టిపోటీ ఇస్తున్నాడు. ఫామ్‌లో లేని ఓపెనర్ ధావన్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఆడగలడు. కాబట్టి ఈ విషయాన్ని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటే రాయుడుకు చోటు కష్టమే. స్వదేశంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీని పక్కనబెట్టే సూచనలు ఉన్నాయి. ఇక బ్యాటింగ్ లైనప్‌లో ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, ధోనిల స్థానాలు ఖాయం. ఒకవేళ 16 మందిని ఎంపిక చేస్తే మాత్రం గురుకీరత్ సింగ్ మన్ అదనపు బ్యాట్స్‌మన్‌గా రావొచ్చు.

మరిన్ని వార్తలు