ఆస్ట్రేలియా పర్యటన ఆలస్యం!

15 Jul, 2020 02:14 IST|Sakshi

టి20 సిరీస్‌ రద్దు చేసే అవకాశం

కరోనాతో బీసీసీఐ షెడ్యూల్‌ తారుమారు

ముంబై: కోవిడ్‌–19 కారణంగా సహజంగానే ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగం స్తబ్దుగా మారిపోయింది. ఇందుకు భారత క్రికెట్‌ కూడా అతీతం కాదు. కరోనా భయంతో మార్చి ఆరంభంలో అర్ధాంతరంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ రద్దు కావడం మొదలు మళ్లీ ఆట జరగలేదు. ఇక ఇప్పుడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏదోలా క్రికెట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకునే ప్రయత్నంలో ఉంది. కరోనా వల్ల భారత క్రికెట్‌ 2020–21 సీజన్‌ షెడ్యూల్‌ అంతా తారుమారైంది. ఇందులో కొన్ని మార్పుచేర్పులతో క్రికెట్‌ కార్యకలాపాలు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.

అటు క్యాంప్‌...ఇటు ఐపీఎల్‌... 
బీసీసీఐ ప్రణాళికల్లో అన్నింటికంటే ముందుగా భారత సీనియర్‌ జట్టుకు శిక్షణా శిబిరం నిర్వహించడం కీలకంగా మారింది. ముందుగా జూలై మూడో వారంలో అనుకున్నా... దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అది సాధ్యం కావడంలేదు. ఇప్పుడు ఆగస్టుకల్లా పరిస్థితి చక్కబడుతుందని బోర్డు ఆశిస్తోంది. అదే జరిగితే బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) సరైన వేదిక అని బోర్డు అధికారులు చెబుతున్నారు. లేదంటే మరో ప్రత్యామ్నాయంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలను అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వసతి, ఇతర సౌకర్యాల గురించి కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఐపీఎల్‌ జరిగే అవకాశం ఉంటే ఆయా జట్ల ఆటగాళ్లు కనీసం 21 రోజుల ముందు తమ జట్లతో చేరాల్సి ఉంటుంది.

ప్రేక్షకులను అనుమతించకపోయినా టీవీ వీక్షకుల కోసమే ఐపీఎల్‌ జరపాలని బోర్డు పట్టుదలగా ఉంది. పూర్తి స్థాయిలో లీగ్‌ నిర్వహిస్తే నవంబర్‌ చివరినుంచి ప్రారంభం కావాల్సిన ఆస్ట్రేలియా పర్యటన కనీసం వారం రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ‘క్రికెట్‌ ఆస్ట్రేలియా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 3 నుంచి తొలి టెస్టు జరగాలి. దానికి ముందు టి20, వన్డే సిరీస్‌లు ఉన్నాయి. అయితే ప్రపంచకప్‌ కోసమే టి20 సిరీస్‌ పెట్టారు. ఇప్పుడు వరల్డ్‌కప్‌ జరిగే అవకాశం లేదు కాబట్టి టి20 సిరీస్‌ రద్దు చేసుకుంటే నష్టమేమీ లేదు. టెస్టు సిరీస్‌ కూడా వారం ఆలస్యం అవుతుంది’ అని బోర్డు అధికారి వెల్లడించారు. ఈ పర్యటన తర్వాత ఇంగ్లండ్‌ జట్టు కూడా భారత్‌కు రావాల్సి ఉంది. ఈ సిరీస్‌ కూడా సహజంగానే ఆలస్యం కానుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు