శాసించే స్థితిలో ఆస్ట్రేలియా

15 Dec, 2019 05:54 IST|Sakshi

ప్రస్తుతం ఓవరాల్‌ ఆధిక్యం 417

తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 166 ఆలౌట్‌  

పెర్త్‌: స్వదేశంలో ఏడో డే నైట్‌ టెస్టులో విజయం దిశగా ఆస్ట్రేలియా జట్టు సాగుతోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇక్కడ డే నైట్‌గా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా శాసించే స్థితికి చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్‌గా తమ ఆధిక్యాన్ని 417 పరుగులకు పెంచుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 109/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌... ఆసీస్‌ బౌలర్ల విజృంభణకు 166 పరుగులకే కుప్పకూలింది. రాస్‌ టేలర్‌ (134 బంతుల్లో 80; 9 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్‌ లయన్‌కు రెండు వికెట్లు లభించాయి. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. బర్న్స్‌ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), లబ్‌షేన్‌ (81 బంతుల్లో 50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వేడ్‌ (8 బ్యాటింగ్‌), కమిన్స్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌతీ నాలుగు వికెట్లు తీశాడు. 

మరిన్ని వార్తలు