ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం

17 Sep, 2013 11:46 IST|Sakshi
ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం

యాషెస్ సిరీస్లో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియాకు ఊరట కలిగించే విజయం. ఇంగ్లండ్తో ఐదు వన్డేల సిరీస్ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. చివరి, ఐదో వన్డేలో షేన్ వాట్సన్ (143) సెంచరీతో చెలరేగడంతో 49 పరుగులతో ఇంగ్లండ్ను ఓడించింది. సోమవారం జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్లో 299 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లీష్ మెన్ను కంగారూలు 48 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్ చేశారు. ఫాల్కనర్ మూడు, మిచెల్ జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రవి బొపార (62), బట్లర్ (42) విజయంపై ఆశలు రేకెత్తించినా ఈ జోడీ వెంటవెంటనే అవుటవడంతో ఓటమి తప్పలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.1 ఓవర్లలో 298 పరుగులు చేసింది. వాట్సన్ సెంచరీకి తోడు కెప్టెన్ మైకేల్ క్లార్క్ (75) అర్ధశతకంతో రాణించాడు. స్టోక్స్ ఐదు, అరంగేట్ర బౌలర్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వాట్సన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', క్లార్క్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కాయి. ఈ సిరీస్లో వర్షం కారణంగా రెండు వన్డేలు రద్దయ్యాయి. గత మేలో ఇంగ్లండ్ వెళ్లిన ఆసీస్ తాజా మ్యాచ్తో పర్యటన ముగించింది.  
 

>
మరిన్ని వార్తలు