ఆసీస్‌ ఆరోసారి...

6 Mar, 2020 01:00 IST|Sakshi

ప్రపంచ కప్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌

సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 5 పరుగులతో విజయం 

సిడ్నీ: ప్రపంచకప్‌లలో దురదృష్టాన్ని పక్కన పెట్టుకొని పరుగెత్తే దక్షిణాఫ్రికాకు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. టి20 మహిళల ప్రపంచకప్‌ లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన ఆ జట్టు... సెమీస్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సన్నద్ధమైన తరుణంలో వర్షం వెంటాడింది. ఫలితంగా ఓవర్లు తగ్గి ఒక్కసారిగా లక్ష్యం మారిపోయింది. ఒత్తిడికి లోనైన సఫారీ టీమ్‌ చివరకు ఓటమిని ఆహ్వానించింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో) ఓడి నిష్క్రమించింది. ఆసీస్‌ వరుసగా ఆరోసారి ప్రపంచకప్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు వన్డే, టి20 ప్రపంచకప్‌లు అన్నీ కలిపి దక్షిణాఫ్రికా పురుషులు, మహిళలు జట్లు ఒక్కసారి కూడా సెమీఫైనల్‌ దశను దాటలేకపోయాయి.

సిడ్నీలో భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి సెమీస్‌ రద్దయిన తర్వాత వర్షం తెరిపినివ్వడంతో నిర్ణీత సమయానికి రెండో సెమీస్‌ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మెగ్‌ లానింగ్‌ (49 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. అనంతరం విరామం సమయంలో మళ్లీ వాన రావడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులుగా నిర్దేశించారు. ఐదు ఓవర్లలోపే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. లారా వోల్‌వార్ట్‌ (27 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది.

మరిన్ని వార్తలు