ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు ఇంగ్లండ్‌

11 Jul, 2019 21:44 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ సగర్వంగా అడుగుపెట్టింది. సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో అమీతుమీకి సిద్దం కానుంది. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో మరో వికెట్‌ పడకుండా రూట్‌, మోర్గాన్‌లు జాగ్రత్తగా ఆడుతున్నారు. అదేవిధంగా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పరిగెత్తిస్తున్నారు. ఇంగ్లండ్‌ విజయానికి మరో 43 పరుగులు కావాలి. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(85) వివాదస్పదంగా ఔటయ్యాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగిన రాయ్‌ అసంతృప్తిగా క్రీజు వదిలి వెళ్లాడు. అయితే రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. దీంతో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. ప్రస్తుతం రూట్‌, మోర్గాన్‌లు క్రీజులో ఉన్నారు. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో(34) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 124 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు జేసన్‌ రాయ్‌ అర్దసెంచరీ పూర్తి చేసి సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. ప్రస్తుతం రాయ్‌కు తోడుగా రూట్‌ క్రీజులో ఉన్నాడు. 

స్మిత్‌ బౌలింగ్‌ను ఉతికారేసిన రాయ్‌
స్టీవ్‌ స్మిత్‌ బౌలింగ్‌ను ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఉతికి ఆరేశాడు.  ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 16 ఓవర్‌ వేసిన స్మిత్‌కు రాయ్‌ చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్‌ సిక్సర్లు కొట్టి తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు.  16 ఓవర్‌ మూడో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన రాయ్‌.. నాల్గో బంతిని సైతం సిక్స్‌గా మలిచాడు. ఆపై లాంగాన్‌ మీదుగా మరో సిక్స్‌ కొట్టాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో 21 పరుగులు పిండుకున్నారు.

రాయ్‌ హాఫ్‌​ సెంచరీ
ఆసీస్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. జేసన్‌ రాయ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. బెయిర్‌ స్టో 32 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.  15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 95 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ ధాటిగా..
ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు ఇప్పటికే 71 పరుగులు జోడించారు. జేసన్‌ రాయ్‌ ధాటిగా ఆడుతుండగా.. బెయిర్‌ స్టో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 11.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. జాసన్‌ రాయ్‌ 40 పరుగులతో, బెయిర్‌ స్టో 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆసీస్‌ 223 ఆలౌట్‌
ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌కు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టీవ్‌ స్మిత్‌(85), అలెక్స్‌ క్యారీ(46)లు రాణించడంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ విలవిల్లాడింది. దీంతో కనీసం 200 పరుగులు దాటుతుందా అనుకున్నారు. అయితే స్మిత్‌, క్యారీలు ఆదుకున్నారు. చివర్లో మ్యాక్స్‌వెల్‌(26), స్టార్క్‌(29) రాణించారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌, వోక్స్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్‌ రెండు వికెట్లు, వుడ్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. 
స్మిత్‌, స్టార్క్‌ వెంటవెంటనే
ఆస్ట్రేలియా వరుసగా రెండు వికెట్లును కోల్పోయింది. తొలుత స్టీవ్‌ స్మిత్‌(85) అనవసరమైన పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. దీంతో సెంచరీ సాధించకుండానే స్మిత్‌ అవుటవ్వడం ఆసీస్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. అనంతరం స్టార్క్‌(29) కూడా వోక్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో 217 పరుగుల వద్దనే ఆసీస్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది.

ఆస్ట్రేలియా మరో వికెట్‌ను చేజార్చుకుంది. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ప్యాట్‌ కమిన్స్‌(6) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రసుతం ఆసీస్‌ 42 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రసుతం స్మిత్‌తో పాటు మిచెల్‌ స్టార్క్‌ క్రీజులో ఉన్నాడు.

ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(22) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో 157 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓ వైపు స్టీవ్‌ స్మిత్‌ వీరోచితంగా పోరాడుతూ ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్‌ సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. స్మిత్‌కు తోడుగా కమ్మిన్స్‌ క్రీజులో ఉన్నాడు.              

ఒకే ఓవర్లో ఇద్దరూ
ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో ఆసీస్‌ మళ్లీ కష్టాల్లో పడింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది  28 ఓవర్‌ రెండో బంతికి అలెక్స్‌ క్యారీ(46) ఔట్‌ కాగా, అదే ఓవర్‌ చివరి బంతికి స్టోయినిస్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో ఆసీస్‌ 118 పరుగుల వద్ద ఐదో వికెట్‌ నష్టపోయింది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడ్డ సమయంలో స్టీవ్‌ స్మిత్‌-క్యారీ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. వీరిద్దరూ 103 పరుగులు జత చేసిన తర్వాత క్యారీ ఔట్‌ కాగా, ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన స్టోయినిస్‌ ఎల్బీడబ్యూగా పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లను ఆదిల్‌ రషీద్‌ సాధించి ఆసీస్‌ను ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టాడు. కాగా, క్యారీ ఔటైన తర్వాత స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం స్మిత్‌ 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

కుదురుకున్న ఆసీస్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ కుదురుకుంది. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో స్టీవ్‌ స్మిత్‌-అలెక్స్‌ క్యారీలు మరమ్మత్తులు చేపట్టారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నారు. ఈ జోడీ ఆసీస్‌ స్కోరును వంద పరుగులు దాటించింది. స్మిత్‌-క్యారీలు హాఫ్‌ సెంచరీలుగా చేరువగా వచ్చారు.

 కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌

ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు.  ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగంలో బలంగా తాకింది. దాంతో క్యారీ విలవిల్లాడిపోయాడు. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్‌ కొనసాగించేందుకు మొగ్గు చూపాడు. కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌ చేయడం అతనికి క్రీడపై ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది.

హ్యాండ్స్‌కాండ్‌..ప్చ్‌

ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఆసీస్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. హ్యాండ్స్‌కాంబ్‌ వికెట్‌ను చేజార్చుకుంది. గాయం కారణంగా ఉస్మాన్‌ ఖవాజా జట్టుకు దూరం కావడంతో తుది జట్టులోకి వచ్చిన హ్యాండ్స్‌కాంబ్‌ నిరాశపరిచాడు. 12 బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే చేసిన హ్యాండ్స్‌కాంబ్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో ఆసీస్‌ 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.

అయ్యో వార్నర్‌..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్లో  డేవిడ్‌ వార్నర్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. క్రిస్‌ వోక్స్‌ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతిని ఫోర్‌ కొట్టిన వార్నర్‌..నాల్గో బంతికి ఔటయ్యాడు. కొద్ది పాటి బౌన్స్‌ వచ్చిన బంతిని ఆడటంలో తడబడిన వార్నర్‌.. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ఆసీస్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.  11 బంతులు ఆడిన వార్నర్‌ 2 ఫోర్లతో 9 పరుగులు చేశాడు.

ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌

ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌, అరోన్‌ ఫించ్‌లు ఆరంభించారు. వోక్స్‌ వేసిన తొలి ఓవర్‌లో వార్నర్‌ నాలుగు పరుగులు చేయగా, జోఫ్రా ఆర్చర్‌ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికి ఫించ్‌ పెవిలియన్‌ చేరాడు. ఫించ్‌ పరుగులేమీ చేయకుండా గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. దీనిపై ఆసీస్‌ రివ్యూకు వెళ్లినా ప్రతికూల ఫలితమే వచ్చింది. దాంతో ఆసీస్‌ రెండో ఓవర్‌లోనే రివ్యూకు కోల్పోవడంతో ఆ జట్టును నిరుత్సాహపరిచింది.

టాస్‌ గెలిచిన ఆసీస్‌

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఒకవైపు ఐదుసార్లు చాంపియన్‌. మరోవైపు సొంతగడ్డపై తొలి టైటిల్‌పై కన్నేసిన జట్టు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఆస్ట్రేలియా అలవోకగా సెమీస్‌లో అడుగుపెడితే.. ఆతిథ్య ఇంగ్లండ్‌ మాత్రం చెమటోడ్చి నాకౌట్‌కు చేరింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో ఫైనల్‌ బెర్త్‌ కోసం రెండో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.  ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ పైచేయి సాధించింది.

ఆసీస్‌ బ్యాటింగ్‌కు వార్నర్‌, కెప్టెన్‌ ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌ వెన్నుముకగా ఉన్నారు. స్టార్క్‌, కమిన్స్‌, స్టొయినిస్‌, బెహ్రెన్‌డార్ఫ్‌లతో ఆ టీమ్‌ బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. మరోవైపు జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, కెప్టెన్‌ మోర్గాన్‌, బట్లర్‌తో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. మార్క్‌ ఉడ్‌, ఆర్చర్‌, క్రిస్‌వోక్స్‌, స్టోక్స్‌ బౌలింగ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

తుది జట్లు

ఆసీస్‌
అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌),డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, హ్యాండ్స్‌ స్కాంబ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీ, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, బెహ్రాన్‌డార్ఫ్‌, నాథన్‌ లయన్‌

ఇంగ్లండ్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జానీ బెయర్‌ స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌, ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌

మరిన్ని వార్తలు