ఆసీస్‌దే టి20 సిరీస్‌

28 Feb, 2020 01:18 IST|Sakshi

చివరి మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం

కేప్‌టౌన్‌: సిరీస్‌ విజేతను నిర్ణయించే చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 97 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. దాంతో సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. పరుగుల పరంగా సఫారీలకు టి20ల్లో ఇది రెండో అతి పెద్ద పరాభవం. ఇదే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 107 పరుగులతో ఓడిన రికార్డు మొదటి స్థానంలో ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌ (37 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్‌ (37 బంతుల్లో 55; 6 ఫోర్లు, సిక్స్‌)... తొలి వికెట్‌కు 67 బంతుల్లోనే 120 పరుగులతో శుభారంభం చేశారు. చివర్లో స్మిత్‌ (15 బంతుల్లో 30 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 15.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్, ఆస్టన్‌ అగర్‌ చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. డస్సెన్‌ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు) టాప్‌ స్కోరుగా నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా స్టార్క్‌... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఫించ్‌ అవార్డులు అందుకున్నారు. గత ఏడాది కాలంలో దక్షిణాఫ్రికా స్వదేశంలో వరుసగా ఓడిపోయిన నాలుగో సిరీస్‌ ఇది. చివరి సారిగా గత ఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌ను 2–1తో గెల్చుకుంది.

>
మరిన్ని వార్తలు