ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఆస్ట్రేలియాదే...

19 Jan, 2020 13:17 IST|Sakshi

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న చివరిదైన సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ చేసిన ఆసీస్‌.. ఈసారి టాస్‌ గెలిచినా తొలుత బ్యాటింగ్‌ చేయడానికి ఆసక్తి చూపింది. భారత్‌ ముందు భారీ లక్ష్యం నిర్దేశించాలనే ఉద్దేశంతోనే ఆసీస్‌ బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించింది.  సిరీస్‌ ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు ఖాతాలో సిరీస్‌ చేరుతుంది. రెండు జట్లు కూడా దాదాపు సమఉజ్జీలుగా కనిపిస్తుండటంతో పాటు భారీ స్కోర్ల వేదికపై మ్యాచ్‌ జరుగుతుండంతో మరో హోరాహోరీ పోరును ఆశించవచ్చు.  

చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు వన్డేల్లో కలిపి డబుల్‌ సెంచరీ సహా 318 పరుగులు చేసిన రికార్డు రోహిత్‌ శర్మ సొంతం. మరొకవైపు శిఖర్‌ ధావన్‌ కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు కేఎల్‌ రాహుల్‌ మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఓపెనర్లతో పాటు రాహుల్‌ అద్భుత ఫామ్‌ భారత్‌కు అదనపు బలంగా మారింది. ఇక కోహ్లి కూడా గత మ్యాచ్‌లో సమయోచితంగా ఆడి హాఫ్‌ సెంచరీ సాధించాడు.   వన్డే జట్టులో స్థిరపడే ప్రయత్నంలో ఉన్న అయ్యర్‌ గత రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం కాస్త ఆందోళన పరుస్తోంది.భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, ఆసీస్‌ జట్టులోకి హజల్‌వుడ్‌ చేరాడు. రిచర్డ్‌సన్‌ స్థానంలో హజల్‌వుడ్‌కు అవకాశం కల్పించారు.

తుదిజట్లు..

భారత్‌
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా

ఆసీస్‌
అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, లబూషేన్‌, అలెక్స్‌ క్యారీ, ఆస్టర్‌ టర్నర్‌, ఆస్టన్‌ ఆగర్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, హజల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా

మరిన్ని వార్తలు