ముగిసిన భారత్‌ పోరు

6 Jun, 2019 21:45 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఇప్పటికే మిక్స్‌డ్‌ డబుల్స్, మహిళల డబుల్స్‌లో భారత జోడీలు వెనుదిరగ్గా, తాజాగా మహిళల, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ ఖాతాలో వేసుకోవాలని బరిలోకి దిగిన పీవీ సింధుతోపాటు, సమీర్‌ వర్మ, సాయిప్రణీత్‌ సైతం ఇంటిబాట పట్టారు. గురువారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, వరల్డ్‌ నెం.5 సింధు 19–21 18–21తో 29వ ర్యాంకర్‌ నిచోన్‌ జిందాపోల్‌(థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. 

49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీలక సమయాల్లో తడబడిన సింధు మూల్యం చెల్లించుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్‌ నెం.12 సమీర్‌ 16–21, 21–7, 13–21తో వాంగ్‌ జు వీ(తైవాన్‌) చేతిలో, సాయి ప్రణీత్‌ 23–25, 9–21తో రెండో సీడ్‌ ఆంథోనీ సినిసుక గింటింగ్‌(ఇండోనేషియా) చేతిలో, పారుపల్లి కశ్యప్‌ 17–21 22–20 14–21తో చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ చేతిలో పోరాడి ఓడారు. అలాగే పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీ పోరాటం సైతం ముగిసింది. సాయిరాజ్‌– చిరాగ్‌ ద్వయం 19–21, 18–21తో లి జున్హుయ్‌– లియూ యుచెన్‌(చైనా) చేతిలో పోరాడి ఓడింది. 

  • ముఖాముఖి పోరులో జిందాపోల్‌ చేతిలో ఇది సింధుకు రెండో ఓటమి. ఇప్పటివరకూ వీరిద్దరూ ఏడు సార్లు తలపడగా ఐదింట్లో విజయం సింధూనే వరించింది. 
  • ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌తోపాటు మరో నాలుగు టోర్నీల్లో పాల్గొన్న సింధు ఒక్కదాంట్లోనూ కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్‌లో మాత్రం సెమీస్‌కు చేరగలిగింది. 
మరిన్ని వార్తలు