‘సిక్సర’ పిడుగు... ఆసీస్‌ కుర్రాడు 

4 Dec, 2018 00:37 IST|Sakshi

అండర్‌–19 క్రికెట్లో   ఒకే ఓవర్లో 6 సిక్సర్లు

17 సిక్సర్లతో ‘డబుల్‌ సెంచరీ’ చేసిన ఆసీస్‌ క్రికెటర్‌ ఓలీ డేవిస్‌  

అడిలైడ్‌: ఆస్ట్రేలియా టీనేజ్‌ క్రికెటర్‌ ఓలీ డేవిస్‌ తన బ్యాట్‌తో అండర్‌–19 వన్డే క్రికెట్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. వరుస 6 బంతుల్లో 6 సిక్సర్లతో పాటు డబుల్‌ సెంచరీ రికార్డుని సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అండర్‌–19 వన్డే నేషనల్‌ చాంపియన్‌షిప్‌కు సిక్సర్ల సునామీతో ఘన ఆరంభాన్నిచ్చాడు. సోమవారమే మొదలైన ఈ టోర్నీలో న్యూసౌత్‌వేల్స్‌ మెట్రో కెప్టెన్, 18 ఏళ్ల డేవిస్‌... నార్తర్న్‌ టెరిటరీ (ఎన్‌టీ) జట్టుపై చెలరేగాడు. 115 బంతుల్లో 14 ఫోర్లు, 17 సిక్సర్లతో 207 పరుగులు చేసి ఈ వన్డే చాంపియన్‌షిప్‌లో ‘డబుల్‌’ చరిత్రను తనపేర రాసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన రోహిత్‌ శర్మ (భారత్‌), డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా), క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)లను మించిపోయాడు.

100 పరుగులను 74 బంతుల్లో పూర్తిచేసిన ఈ సిడ్నీ సంచలనం తర్వాతి 100 పరుగులను కేవలం 39 బంతుల్లోనే సాధించడం విశేషం. ఎన్‌టీ స్పిన్నర్‌ జాక్‌ జేమ్స్‌ వేసిన 40వ ఓవర్లో అతను వరుస ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్‌ (వెస్టిండీస్‌), రవిశాస్త్రి (భారత్‌), హెర్షల్‌ గిబ్స్‌ (దక్షిణాఫ్రికా), యువరాజ్‌ సింగ్‌ (భారత్‌), జోర్డాన్‌ క్లార్క్‌ (ఇంగ్లండ్‌) వరుస ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు. గిబ్స్, యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో... సోబర్స్, జోర్డాన్‌ క్లార్క్‌ కౌంటీ క్రికెట్‌లో... రవిశాస్త్రి రంజీ క్రికెట్‌లో ఈ ఘనత సాధించారు. ఓలీ డేవిస్‌ ధాటికి ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్‌ మెట్రో 50 ఓవర్లలో 4 వికెట్లకు 406 పరుగుల భారీస్కోరు చేయగా, నార్తర్న్‌ టెరిటరీ 238 పరుగుల వద్ద ఆలౌటైంది. మెట్రో జట్టు 168 పరుగులతో జయభేరి మోగించింది.    
 

మరిన్ని వార్తలు