25 శాతం ప్రేక్షకులకు ఓకే

13 Jun, 2020 00:41 IST|Sakshi

మైదానాల్లో అభిమానుల రాకకు అనుమతి ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

మెల్‌బోర్న్‌: ప్రపంచ దేశాల్లో ఒక్కొక్కటిగా క్రీడా సంబంధిత కార్యకలాపాలకు కరోనా నిబంధనల నుంచి మినహాయింపులు లభిస్తున్నాయి. తాజాగా 25 శాతం ప్రేక్షకుల్ని మైదానాల్లో అనుమతించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. ఆసీస్‌ ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశారు. జాతీయ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చేనెల నుంచి 40,000 సీటింగ్‌ సామర్థ్యం ఉన్న క్రీడా మైదానాల్లోకి 10,000 మంది ప్రేక్షకుల్ని అనుమతిస్తాం అని పేర్కొన్నారు. ‘మ్యాచ్‌లు, పండుగలు, కచేరీలకు ప్రేక్షకులు వెళ్లవచ్చు. కానీ ఆతిథ్య వేదిక విశాలంగా ఉండాలి. సీట్ల మధ్య తగిన దూరం ఏర్పాటు చేయాలి. ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులకు టిక్కెట్లను కేటాయించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ స్టేడియం సామర్థ్యాన్ని బట్టి 25 శాతం ప్రేక్షకుల్ని మాత్రమే ఆహ్వానించాలి. ఆరోగ్య అధికారుల సహాయంతో వేదికల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను రూపొందిస్తున్నాం’ అని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు