వీనస్‌కు షాక్‌

20 Jan, 2020 21:10 IST|Sakshi

యువ సంచలనం కోరి గాఫ్‌ చేతిలో పరాజయం

రెండో రౌండ్‌కు ఫెదరర్, జకోవిచ్, సిట్సిపాస్, సెరెనా, ఒసాకా, క్విటోవా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఈ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం చోటుచేసుకుంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత, అమెరికా దిగ్గజ క్రీడాకారిణి వీనస్‌ విలియమ్స్‌ 6–7(5/7), 3–6తో యువ సంచలనం, 15 ఏళ్ల కోరి గాఫ్‌ చేతిలో పరాజయం పాలైంది. గతేడాది వింబుల్డన్‌ తొలి రౌండ్‌లోనే వీనస్‌ను ఇంటిబాట పట్టించిన గాఫ్‌ మరోసారి అదే ఫలితం పునరావృతం చేసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్‌లో గెలుచుకున్న గాఫ్‌ రెండో సెట్‌లో తిరుగులేని ఆటతీరు ప్రదర్శించింది. కాగా, సోమవారం బరిలోకి దిగిన మిగిలిన సీడెడ్‌ క్రీడాకారులకు శుభారంభం లభించింది. 

మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నెం.1, స్థానిక క్రీడాకారిణి ఆష్లే బార్టీ 5–7, 6–1, 6–1తో సురెంకో(ఉక్రెయిన్‌)పై, వరల్డ్‌ నెం.4 నవోమీ ఒసాకా(జపాన్‌) 6–2, 6–4తో మారీ బౌజ్‌కోవా(చెక్‌రిపబ్లిక్‌)పై గెలుపొందగా, మార్గరెట్‌ కోర్ట్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ, ఎనిమిదో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ 6–0, 6–3తో అనస్తాసియా పొటపొవా(రష్యా) ను చిత్తు చేసింది. మాజీ నెం.1 కరోలినా వోజ్నియాకీ(డెన్మార్క్‌) 6–1, 6–3తో క్రిస్టీ ఆన్‌(అమెరికా)పై గెలుపొందింది. ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా(చెక్‌రిపబ్లిక్‌) 6–1, 6–0తో తన దేశానికే చెందిన సినియకోవాపై నెగ్గగా, స్లోన్‌ స్టీఫెన్స్‌(అమెరికా) 6–2, 5–7, 2–6తో జాంగ్‌(చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 

చెమటోడ్చిన జకోవిచ్‌..
పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్‌ రోజర్‌ ఫెడరర్‌ 6–3 6–2 6–2తో స్టీవ్‌ జాన్సన్‌(అమెరికా)పై గెలుపొందగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ తొలి రౌండ్‌లోనే చెమటోడ్చాడు. హోరాహోరీగా జరిగిన పోరులో జకోవిచ్‌ 7–6, 6–2, 2–6, 6–1తో జాన్‌–లెనార్డ్‌ స్ట్రఫ్‌(జర్మనీ)పై నెగ్గాడు.  అలాగే ఆరో సీడ్, గ్రీస్‌ స్టార్‌ సిట్సిపాస్‌ 6–0, 6–1, 6–3తో కరుసో(ఇటలీ)పై, ఎనిమిదో సీడ్‌ మారియో బరెత్తిని(ఇటలీ) 6–3, 6–1, 6–3తో హారిస్‌(ఆస్ట్రేలియా)పై, వరల్డ్‌ నెం.18 దిమిత్రోవ్‌(బల్గేరియా) 4–6, 6–2, 6–0, 6–4తో లోండెరో(అర్జెంటీనా)పై,  గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు.  

మరిన్ని వార్తలు