ఇది నిలువెల్లా మోసం 

27 Mar, 2018 00:59 IST|Sakshi

దుమ్మెత్తిపోసిన ఆస్ట్రేలియా మీడియా

సిడ్నీ: సహజంగా తమ ఆటగాళ్లను బాగా వెనకేసుకొచ్చే ఆస్ట్రేలియా మీడియాకు కూడా బాల్‌ ట్యాంపరింగ్‌ ఘటన కంపరం పుట్టించినట్లుంది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి అంటూ స్థానిక ప్రసార మాధ్యమాలు ధ్వజమెత్తుతుండటమే దీనికి నిదర్శనం. ‘స్మిత్స్‌ షేమ్‌’ అంటూ మొదటి పేజీలో కథనం ఇచ్చిన ‘ది ఆస్ట్రేలియన్‌’ పత్రిక... ‘ఇది హెల్మెట్‌ నుంచి బూటు వరకు చేసిన నిలువెత్తు మోసం’గా  అభివర్ణించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది. ‘రెండు దశాబ్దాలుగా సీఏను నడిపిస్తున్న సదర్లాండ్‌ జాతీయ జట్టు సంస్కృతిని మార్చలేకపోయారు. స్మిత్‌ చర్య పరిస్థితులరీత్యా చేసింది కాదని సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్‌ పేర్కొనగా, ఈ ఉదంతం స్మిత్, జట్టు పేరు ప్రఖ్యాతులకు కోలుకోలేని దెబ్బని, తీవ్ర మూల్యం చెల్లించారని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ అభివర్ణించింది. 

పునరాలోచనలో జట్టు స్పాన్సర్లు... 
ట్యాంపరింగ్‌ ఆస్ట్రేలియా జట్టు స్పాన్సర్‌షిప్‌పైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 600 మిలియన్ల ఆస్ట్రేలియన్‌ డాలర్ల టీవీ ప్రసార హక్కుల ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. తాజా పరిణామాలతో స్పాన్సర్లు బేరానికి దిగనున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద స్పాన్సర్‌ అయిన మాజిలాన్‌ సంస్థ... ట్యాంపరింగ్‌ను తీవ్ర మోసంగా పేర్కొంది. ‘మేం చాలా అసంతృప్తికి గురయ్యాం. మా జాతీయ జట్టు నుంచి ఇలాంటిది ఆశించలేదు’ అని ఎయిర్‌లైన్‌ క్వాంటాస్‌ స్పష్టం చేసింది. ఈ సంస్థ పేరున్న జెర్సీనే ప్రస్తుత సిరీస్‌లో ఆటగాళ్లు ధరిస్తున్నారు. ఆ దేశ మహిళా జట్టు స్పాన్సర్‌ అయిన కామన్వెల్త్‌ బ్యాంక్‌ కూడా దీనిపై సీఏ నుంచి వివరణ కోరింది.   

మరిన్ని వార్తలు