-

ఫిర్యాదుపై ముందుకి... వెనక్కి

10 Mar, 2017 07:48 IST|Sakshi
ఫిర్యాదుపై ముందుకి... వెనక్కి

ఆసీస్‌ ఆటగాళ్లపై ఫిర్యాదు చేసి ఉపసంహరించుకున్న భారత్‌

బెంగళూరు: స్టీవ్‌ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరకు ‘సంధి’తో ముగిసింది. బుధవారం ఎవరిపై చర్యలు లేవంటూ ఐసీసీ చేసిన ప్రకటనపై సంతృప్తి చెందని బీసీసీఐ, మరుసటి రోజు స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే దాదాపు అర్ధ రాత్రి సమయంలో రెండు దేశాల బోర్డులు ఈ వివాదాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా కలిసి సంయుక్త ప్రకటన జారీ చేశాయి. దీని ప్రకారం బీసీసీఐ తమ ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు సమావేశమవుతారు. మిగిలిన సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడేలా, ఆటగాళ్లుగా తమ దేశాలకు అసలైన రాయబారులుగా వ్యవహరించేలా కోహ్లి, స్మిత్‌ తమ జట్లను నడిపిస్తారు.

అంతకు ముందు జరిగిన పరిణామాలను చూస్తే... ఇరు జట్లతో చర్చించిన తర్వాత రివ్యూ ఘటనకు ఐసీసీ ముగింపు పలికిందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా భారత బోర్డు మరో సారి తలపడేందుకు సిద్ధమైంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం లెవెల్‌ 2 స్థాయి ఆరోపణలు నమోదు చేయాలంటూ బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ఐసీసీకి పంపిన మెయిల్‌లో తమ వాదనకు మద్దతుగా ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా భారత్‌ జత చేసింది. ‘స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌లపై బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. స్మిత్‌ను పెవిలియన్‌ వైపునుంచి సలహా అడగమంటూ హ్యాండ్స్‌కోంబ్‌ చెప్పడం, అంపైర్‌ నైజేల్‌ లాంగ్‌ జోక్యం చేసుకున్న వీడియోను కూడా మేం జత చేశాం. నిబంధనల ప్రకారం మ్యాచ్‌ ముగిసిన 48 గంటల్లోపే ఈ ఫిర్యాదు దాఖలు చేశాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత్‌ టెస్టుకు సంబంధించి ఆ ఒక్క ఘటనపైనే ప్రత్యేకంగా దృష్టి పెడుతూ తమ ఫిర్యాదులో ఆరోపణలు చేసింది. తమ ఫిర్యాదులో ‘క్రికెట్‌ స్ఫూర్తిని దెబ్బ తీయడం, ఆటను అగౌరవపర్చడం’ అనే వాక్యాన్ని భారత్‌ వాడినట్లు తెలిసింది.

అందుకే ఆగ్రహమా!
డ్రెస్సింగ్‌ రూమ్‌నుంచి రివ్యూపై స్మిత్‌ సూచనలు కోరడం అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత హ్యాండ్స్‌కోంబ్‌ కూడా తనదే తప్పంటూ ట్విట్టర్‌లో పొరపాటు అంగీకరించాడు కూడా. అయితే ఇంత జరిగినా ఆసీస్‌ బోర్డు తమ ఆటగాళ్లను వెనకేసుకు వస్తూ పనిలో పనిగా కోహ్లిని కూడా విమర్శించింది. ఇది బీసీసీఐకి చిరాకు తెప్పించింది. నిజానికి మ్యాచ్‌ ముగిశాక రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ కనీసం స్మిత్‌ను వివరణ కోరి హెచ్చరిస్తారని భావించింది. వీటన్నింటికి తోడు రాంచీ టెస్టుపై దృష్టి పెట్టాలంటూ ఐసీసీ సుద్దులు చెప్పడం భారత బోర్డును నచ్చలేదు. ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉన్న 48 గంటలు పూర్తిగా గడవక ముందే ఐసీసీ తమ తీర్పు వెలువరించేయడం కూడా భారత్‌ను ఈ ఘటనపై పునరాలోచించేలా చేసింది.

మరిన్ని వార్తలు