పంత్‌.. నీ స్లెడ్జింగ్‌ను స్వాగతిస్తున్నా: ఆస్ట్రేలియా ప్రధాని

2 Jan, 2019 15:08 IST|Sakshi

సిడ్నీ : భారత్‌-ఆస్ట్రేలియాల బోర్డర్‌ గావాస్కర్‌ టెస్ట్‌ సిరీస్‌ ఆసాంతం టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ హాట్‌ టాపిక్‌ అవుతున్నాడు. మైదానంలో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌తో వ్యవహరించిన తీరు.. అనంతరం వారి కుటుంబంతో గడపడం, పైన్‌ సతీమణి బెస్ట్‌ బేబీసిట్టర్‌ అంటూ.. పంత్‌ను కొనియాడటం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే చివరి టెస్ట్‌ ఆడేందుకు సిడ్నీకి వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లకు ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తన నివాసంలో విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిషభ్‌ పంత్‌ ఆసీస్‌ ప్రధానికి తారసపడగా.. అక్కడున్న టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం పరిచయం చేయబోయ్యారు. మారిసన్‌ వెంటనే ‘అయ్యో ఇతను నాకెందుకు తెలియదు.. పంత్‌.. నీవు స్లెడ్జ్‌ చేశావ్‌ కదా! నీ స్లెడ్జింగ్‌ను నేను స్వాగతిస్తున్నాను. మేం ఇలాంటి రసవత్తర పోరునే ఇష్టపడతాం’ అని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక మూడో టెస్ట్‌లో పైన్‌-పంత్‌ల మధ్య స్లెడ్జింగ్‌ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. 

పంత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పైన్‌.. ‘జట్టులోకి ధోని వచ్చాడు. ఇక నువ్వు ఇక్కడే మా బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడుకో. హోబర్ట్‌ హరికేన్స్‌ తరఫున బ్యాటింగ్‌ చెయ్‌. అలా ఆసీస్‌లో సెలవుల్ని అస్వాదించు. అన్నట్లు నేను నా భార్య సినిమాకెళ్లి చాలా రోజులైంది. నువ్వు మా ఇంట్లో బేబీ సిట్టర్‌గా ఉంటే మేమిద్దరం సినిమాని ఎంజాయ్‌ చేస్తాం’ అంటూ స్లెడ్జింగ్‌ చేశాడు. దీనికి రిషభ్‌ కూడా దీటుగానే బదులిచ్చాడు. పైన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మయాంక్‌తో ‘ఈ రోజు మనం ఓ ప్రత్యేక అతిథిని చూస్తున్నాం. పెద్దగా బాధ్యతలేని పని. అదే తాత్కాలిక కెప్టెన్‌. ఎపుడైనా ఇలాంటి తాత్కాలిక కెప్టెన్‌ను చూశామా? దాని గురించి విన్నామా? అతన్ని ఔట్‌ చేసేందుకు శ్రమించాల్సిన పనిలేదు బాయ్స్‌ (బౌలర్లనుద్దేశించి). మాట్లాడితే చాలు. అతిగా మాట్లాడటమే ఇష్టం. అంతే’ అని నోటితోనే బదులిచ్చాడు. ఇదంతా వివాదం కాకపోవడంతో ఈ మ్యాచ్‌ ఆరోగ్యకరంగానే ముగిసింది. ఇక ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న కోహ్లిసేన.. రేపటి (గురువారం) నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌ను సైతం నెగ్గి చరిత్రసృష్టించాలని భావిస్తోంది.  
 

మరిన్ని వార్తలు