ఆస్ట్రేలియన్ ‘ఓవెన్’

16 Jan, 2014 01:12 IST|Sakshi
ఆస్ట్రేలియన్ ‘ఓవెన్’

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆటగాళ్లు ఉడికిపోతున్నారు. భానుడి ప్రచండ జ్వాలలకు తట్టుకోలేక మాడిపోతున్నారు. వరుసగా రెండో రోజూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్లేయర్లు ‘నీరు’గారిపోతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక కొంత మంది చచ్చిపోతామని భయపడుతుంటే.. మరికొంత మంది గాయాలబారిన పడుతున్నారు.
 
 బుధవారం మధ్యాహ్నం 41.5 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రత... సాయంత్రం 6 గంటలకు 32డిగ్రీలకు తగ్గింది. అయినా కూడా ఆటగాళ్లు ఉక్కపోత భరించలేకపోతున్నారు. దీంతో ఐస్‌ప్యాక్‌లు, ఐసోటానిక్ డ్రింక్స్‌లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఇవాన్ డుడిగ్ వేడిని తట్టుకోలేక మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన ఆటగాళ్ల సంఖ్య 10కు చేరుకుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదో రికార్డు.
 
 మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో వేడిమిని తట్టుకోలేక ఫ్రాంక్ డాన్స్‌విక్ (కెనడా) రిటైర్డ్‌హర్ట్ కాగా, పెంగ్ షుయ్ (చైనా) వాంతులు చేసుకుంది. ఓ బాల్ బాయ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.  కోర్టులో వేడికి ప్లాస్టిక్ బాటిల్ కరిగిందని ముర్రే, వోజ్నియాకి తెలిపారు. ఫిజియోతో చికిత్స కోసం నేల మీద పడుకుంటే శరీరం ప్రై అయ్యిందని డబుల్స్ ప్లేయర్ కొలిన్ ఫ్లెమింగ్ వాపోయాడు. అటు ప్రేక్షకులు కూడా  స్టేడియం బయట ఫౌంటేన్‌లోకి దిగి చల్లబడుతున్నారు.
 

మరిన్ని వార్తలు