30 ఏళ్ల తరువాత వరల్డ్ కప్ పతకాలు..

21 Jan, 2017 14:35 IST|Sakshi
30 ఏళ్ల తరువాత వరల్డ్ కప్ పతకాలు..

సిడ్నీ:ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్కు సంబంధించిన పతకాలను ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆదివారం అందుకోనున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆరంభమయ్యాక నాల్గో ఎడిషన్ టైటిల్ను ఆసీస్ తొలిసారి సాధించింది. 1987లో వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను ఆసీస్ అందుకున్నా.. విజయంలో పాలు పంచుకున్న క్రికెటర్లకు పతకాలు అందలేదు. అప్పట్లో వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చే దేశ క్రికెట్ బోర్డుపైనే అంతా ఆధారపడేది. అప్పట్లో మెగా క్రికెట్ ఈవెంట్లలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉండేది కాదు.  ఆ క్రమంలోనే ఆనాటి వరల్డ్ కప్ సాధించిన ఆసీస్ జట్టులో భాగస్వామ్యమైన క్రికెటర్లకు పతకాలు అందలేదు. 1987 వన్డే వరల్డ్ కప్ను భారత్-పాకిస్తాన్ జట్లు సంయుక్తంగా నిర్వహించాయి.

అయితే వరల్డ్ కప్ విజయంలో భాగస్వామ్యమైన అప్పటి ఆసీస్ ఆటగాళ్లకు పతకాలను ఇవ్వాలని గతేడాది జూన్లో ఐసీసీ నిర్ణయించింది. ఆసీస్ ఆటగాళ్లతో పాటు, సహాయక సిబ్బందికి కూడా పతకాలను ఇచ్చేందుకు ఐసీసీ మొగ్గు చూపింది.  ఈ మేరకు రేపు సిడ్నీలో పాకిస్తాన్ తో జరిగే నాల్గో వన్డే విరామ సమయంలో ఆసీస్ వెటరన్లు పతకాలను అందుకోనున్నారు. ఇలా ఐసీసీ ముందుకు రావడంపై ఆనాటి వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ అలెన్ బోర్డర్ హర్షం వ్యక్తం చేశాడు. చాలా ఏళ్ల తరువాత తమకు ఈ తరహాలో గౌరవం అందడం ఎంతో గర్వంగా ఉందని బోర్డర్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు