హద్దులు మీరిన స్లెడ్జింగ్‌.. లియోన్‌కు జరిమానా

6 Mar, 2018 09:01 IST|Sakshi
నాథన్‌, డివిలియర్స్‌

డర్బన్‌ : ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో అతిగా ప్రవర్తించిన స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌( ఐసీసీ) జరిమాన విధించింది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులోనే స్లెడ్జింగ్‌ తారా స్థాయికి చేరింది. ప్రొటీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లు క్రీడా స్పూర్తి మరిచి ప్రవర్తించారు. లియోన్‌ వేసిన 12 ఓవర్లో మార్క్‌రమ్‌తో సమన్వయ లోపంతో ఏబీ డివిలియర్స్‌ రనౌట్‌ అయ్యాడు. ఆనందంలో మునిగిపోయిన లియోన్‌ బంతిని ఏబీ పైకి విసరడంతో చాతికి తగిలింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో నాథన్‌కు  మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. అయితే బంతి కావాలని విసరలేదని నాథన్‌ క్షమాపణలు కోరాడు.

ఈ రనౌట్‌ వ్యవహారంలోనే వార్నర్‌-డికాక్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  నాలుగో రోజు టీ విరామం సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం దూషించుకున్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లే దారిలో ఉన్న మెట్ల వద్దే వార్నర్‌ ఆవేశంగా డి కాక్‌ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డయింది. సహచరుడు ఖాజా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వార్నర్‌ మాత్రం తగ్గలేదు. కొద్ది దూరంలోనే ఉన్న డి కాక్‌ కూడా ఆ సమయంలో ఏదో అంటూ తమ జట్టు గది వైపు వెళ్లిపోయాడు. ఇక తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై ఆసీస్‌118 పరుగులతో ఘన విజయం సాధించింది.  

మరిన్ని వార్తలు