క్రికెట్‌ ఆస్ట్రేలియా కఠిన నిర్ణయాలు..

15 Nov, 2018 16:41 IST|Sakshi

సిడ్నీ: సుదీర్ఘకాలం క్రికెట్‌ను శాసించిన జట్లలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఒకటి. గతంలో ఓటమి అంటే తెలియని జట్టు.. ఇప్పుడు గెలుపు కోసం తపించిపోతుంది. ఒకవైపు ఆసీస్‌ జట్టును నిలకడలేమీ విపరీతంగా దెబ్బతీస్తుండగా, మరొకవైపు స్టార్‌ క్రికెటర్లు పలు కారణాలతో దూరం కావడం ఆ జట్టుకు శాపంలా మారింది. దాంతో వచ్చే ఏడాది జరుగునున్న వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌ అంచనాలను అందుకోవడం కష్టంగానే ఉంది. అయితే తమ జట్టును ఎలాగైనా గాడిలో పెట్టాలనే యోచనలో ఉన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా తాజాగా కొన్ని కఠిన నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆసీస్‌ క్రికెటర్లకు కొన్ని కఠిన నిబంధనలను విధించింది. ప్రధానంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో పాల్గొనే ఆ దేశ క‍్రికెటర్లను అడ్డుకునేందుకు కసరత్తులు చేస్తోంది. (మా ఆటగాళ్లంతా పూర్తి సీజన్‌కు...)

ఐపీఎల్‌-2019కి, ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు మధ్య విరామ సమయం చాలా తక్కువగా ఉండటంతో ఐపీఎల్‌లో పాల్గొనే ఆసీస్‌ క్రికెటర్ల విషయంలో సీఏ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. క్రికెటర్లు దేశానికే తొలి ప్రాధాన్యమివ్వాలని బోర్డు అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌ మార్చి చివరి వారంలో ఆరంభమై, మే 19న ముగిసే అవకాశాలున్నాయి. మరోవైపు మే 30 నుంచి ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. ఇంత తక్కువ సమయంలో ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడం కష్టం. ప్రపంచకప్‌కు ఎంపికైన 15మంది ఆసీస్‌ క్రికెటర్లు ఆ సమయంలో ఐపీఎల్‌లో ఆడుతుంటే అప్పటికప్పుడే టోర్నీనుంచి వైదొలిగి స్వదేశానికి పయనం కావాలని ఆదేశాలు జారీ చేసింది.

దీనికితోడు ఐపీఎల్‌లో ఆడాలనుకునే ఆసీస్‌ క్రికెటర్లు ముందుగా సీఏ నుంచి అనుమతి తీసుకోవాలని, ఈ క్రమంలో స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నీలో తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించిన తర్వాతే ఐపీఎల్‌కు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. మరోవైపు మార్చి 15-29మధ్య ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ ఉండే అవకాశం ఉంది. ఫలితంగా ఈ సిరీస్‌ ముగిసిన తర్వాతే సదరు ఆటగాళ్లను ఐపీఎల్‌కు అనుమతిస్తామని సీఏ పేర్కొంది. ఇన్ని నిబంధనల మధ్య ఆసీస్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడేందుకు మొగ్గుచూపకపోవచ్చు.

ఇక్కడ చదవండి: వచ్చే ఐపీఎల్‌కు స్టార్క్‌ దూరం

కోహ్లి విన్నపాన్ని మన్నిస్తారా?

మరిన్ని వార్తలు